Andhra Pradesh: వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం.. వీడియో ఇదిగో!
- మచిలీపట్నంలో గురువారం మధ్యాహ్నం ఘటన
- భారీ వర్షానికి జలమయం అయిన రోడ్లు
- వాహనంలో నుంచి వరద నీళ్లలో పడ్డ పాల ప్యాకెట్లు
ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తీర ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మచిలీపట్నంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు వరద చేరింది. ఆ వరదలో పాలప్యాకెట్లు కొట్టుకు రావడంతో మొదట ఆశ్చర్యపోయిన జనం.. తేరుకుని వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. మోకాళ్ల లోతు నీటిలో పాల ప్యాకెట్లను ఏరుకుంటున్న జనాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.
వరద నీళ్లలో పాల ప్యాకెట్లు కొట్టుకురావడమేంటని ఆరాతీయగా.. సాయిబాబా ఆలయం జంక్షన్‌లో మోకాలిలోతు నీరు నిలిచింది. ఆ వరదలోనే అటుగా వెళ్తున్న ఓ వాహనం నుంచి పాల ప్యాకెట్ల ట్రేలు కిందపడ్డాయి. దీంతో పాల ప్యాకెట్లు కొట్టుకొచ్చాయని, నీళ్లలో దిగి స్థానికులు వాటిని ఏరుకున్నారని చెబుతున్నారు. కాగా, రెండు రోజులుగా ఏపీలోని తీర ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.