Delhi: ఢిల్లీలో సుప్రీంకోర్టు వరకు వచ్చిన వరద నీరు
- ఢిల్లీ, యమునా నది పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు
- ఉప్పొంగుతున్న యమున
- డ్రెయిన్ రెగ్యులేటర్ దెబ్బతినడంతో ఢిల్లీ నగరంలోకి వరద నీరు ప్రవేశం
- ఆర్మీ సాయం కోరిన సీఎం కేజ్రీవాల్
ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు భారీ వరదలకు కారణమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ, యమునా నది పరీవాహక ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయింది.
యమునా నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండగా, వరద నీరు ఢిల్లీ నగరంలోకి కూడా ప్రవేశించింది. తిలక్ మార్గ్ లో ఉన్న సుప్రీంకోర్టు భవనం వరకు వరద నీరు వచ్చింది. నిన్నటితో పోల్చితే ఇవాళ వరద ఉద్ధృతి కాస్త తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. దాంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
కాగా, డబ్ల్యూహెచ్ఓ భవనం, ఇంద్రప్రస్త బస్ డిపో మధ్య ఉన్న డ్రెయిన్ రెగ్యులేటర్ దెబ్బతిన్న కారణంగానే యమునా నది వరద నీరు ఢిల్లీ నగరంలోకి ప్రవేశించినట్టు గుర్తించారు. దీనిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. అత్యవసర ప్రాతిపదికన డ్రెయిన్ రెగ్యులేటర్ కు మరమ్మతులు చేయాలని ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ లకు విజ్ఞప్తి చేశారు. ఇంజినీరింగ్ విభాగం తీవ్రంగా శ్రమించినప్పటికీ రెగ్యులేటర్ ను చక్కదిద్దలేకపోయిందని తెలిపారు.