Harish Rao: బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణమన్న కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన హరీశ్ రావు
- ఉచిత విద్యుత్ వద్దన్న వారిని ప్రజలు రాజకీయంగా సమాధి చేశారని వ్యాఖ్య
- రైతులకు ఏడు గంటల విద్యుత్ కూడా ఇవ్వలేమని నాటి కాంగ్రెస్ సీఎం అన్నారన్న హరీశ్
- బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కు లింక్ చేయడంపై ఆగ్రహం
- విద్యుత్ పై రెఫరెండంకు వెళదామని సవాల్
- మూడు పంటలు.. మూడు గంటలు.. మతం పేరిట మంటలు మూడు పార్టీల నినాదాలని వ్యాఖ్య
గతంలో ఉచిత విద్యుత్ వద్దన్న వారిని ప్రజలు రాజకీయంగా సమాధి చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఉచిత విద్యుత్ కు వ్యతిరేకమని చెబుతున్నారని, కాబట్టి ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయమని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... పంటలకు విద్యుత్ ఇవ్వడంపై ప్రభుత్వం చేతులెత్తేసిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, కానీ కాంగ్రెస్ హయాంలోనే ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు 7 గంటల పాటు విద్యుత్ ఇవ్వలేమని నాటి కాంగ్రెస్ సీఎం చేతులెత్తేశారన్నారు. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూడు ఎకరాలకు మూడు గంటల విద్యుత్ చాలని చెప్పారన్నారు.
కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు నాలుగైదు గంటల విద్యుత్ కూడా రాలేదన్నారు. కాంగ్రెస్ నేతలు విద్యుత్ పైన ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సోనియా గాంధీ అయితే ఉచిత విద్యుత్ కు వ్యతిరేకమని చెప్పారన్నారు. కాంగ్రెస్ ఇష్టారీతిగా మాట్లాడి తన నిజస్వరూపాన్ని బయటపెడుతోందన్నారు.
బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణమని ఆరోపణలు చేస్తున్నారని, ఇంతకంటే జోక్ ఉంటుందా? అని నిలదీశారు. ఆ రోజు చంద్రబాబు కరెంట్ బిల్లులు పెంచితే కేసీఆర్ వ్యతిరేకించారని తెలిపారు. 2001లో బషీర్ బాగ్ కాల్పులు జరిగిన రోజునే.. నాటి అధికార టీడీపీలో ఉన్న కేసీఆర్ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో కేసీఆర్ రైతుల తరఫున చంద్రబాబుకు లేఖ రాశారన్నారు. కానీ కాంగ్రెస్ బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కు లింక్ చేయడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ నేతలు పదవుల కోసం చొక్కాలు మార్చినట్లు పార్టీలు మారిస్తే, కేసీఆర్ పదవులనే వదులుకున్నారన్నారు.
కరెంట్ లేదని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు కరెంట్ వైర్లు పట్టుకొని చూడాలన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ ఎలా ఉంది? అనే అంశంతో ప్రజల వద్దకు వెళ్దామా? అని సవాల్ చేశారు. వీటిపై ప్రజలను రెఫరెండం కోరుదామా? అని ప్రశ్నించారు. ఈ రోజు కేసీఆర్ నినాదం మూడు పంటలు... కాంగ్రెస్ నినాదం మూడు గంటలు.. బీజేపీ నినాదం మతం పేరిట మంటలు అని వ్యాఖ్యానించారు. ఈ రోజు తెలంగాణ సమాజం దీనిని ఆలోచించాలని సూచించారు.
దేశంలో ఏ కాంగ్రెస్ పాలిత లేదా ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోను ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ లో ఇరవై నాలుగు గంటల విద్యుత్ కోసం రైతులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదని, అందుకే తెలంగాణలో విద్యుత్ ను 24 గంటలు ఇవ్వకుండా కుట్రలు చేస్తోందన్నారు. పగటి పూట 9 గంటల విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ 2009లో అధికారంలోకి వచ్చిందని, కానీ ఆ తర్వాత నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి 7 గంటల విద్యుత్ కూడా ఇవ్వలేమని చెప్పారన్నారు. ఇన్నేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంట్ సరిగ్గా రావడం లేదని కాంగ్రెస్ ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడిందా? కానీ కాంగ్రెస్ హయాంలో విద్యుత్ మొదటి వాయిదా తీర్మానంగా ఉండేదన్నారు.
కాంగ్రెస్ తమ తప్పును ఒప్పు చేసుకోవడానికి కేసీఆర్ పై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బషీర్ బాగ్ కాల్పులు, అవినీతి అంటూ చిల్లర రాజకీయాలు, దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఒక పీసీసీ అధ్యక్షుడిగా ఉండాల్సిన అవగాహన రేవంత్ కు లేదన్నారు. పీసీసీ చీఫ్ ఎంతో బాధ్యతాయుతంగా మాట్లాడాలన్నారు. గతంలో ఉచిత విద్యుత్ వద్దన్న పార్టీలను ప్రజలు సమాధి చేశారని, ఇప్పుడు సోనియా కూడా ఉచిత విద్యుత్ కు వ్యతిరేకమని చెబుతున్నారని, మీకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.