Vasireddy Padma: వాలంటీర్లపై వ్యాఖ్యలకు పవన్ ఆధారాలు చూపించాల్సిందే: వాసిరెడ్డి పద్మ
- సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఉమెన్ డిగ్నిటీ డే
- ప్రారంభించిన వాసిరెడ్డి పద్మ
- పవన్ కు మహిళా కమిషన్ అంటే గౌరవం లేదని విమర్శలు
- తాము పంపిన నోటీసులను లైట్ తీసుకుంటున్నారని ఆగ్రహం
వెలగపూడి వద్ద రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సచివాలయం మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన 'ఉమెన్ డిగ్నిటీ డే' కార్యక్రమాన్ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేనాని పవన్ కల్యాణ్ అంశాన్ని ప్రస్తావించారు.
పవన్ కల్యాణ్ కు మహిళా కమిషన్ అంటే గౌరవం లేదని విమర్శించారు. మహిళా కమిషన్ నోటీసులను పంపినా ఆయన పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగానూ సమర్థనీయం కాదని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. పవన్ తన ఆరోపణలపై ఆధారాలు చూపించాల్సిందేనని తేల్చిచెప్పారు.
ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలను వాలంటీర్లు సంఘ వ్యతిరేక శక్తులకు ఇస్తున్నారని పవన్ కల్యాణ్ చెబుతున్నారని, ఈ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని తెలిపారు.
ఎవరో ఒకరిద్దరు తప్పు చేసినంత మాత్రాన, ఆ తప్పును వ్యవస్థ మొత్తానికి ఆపాదించడం సరికాదని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. జనసేన కార్యకర్తలు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, మరి మీ పార్టీని రద్దు చేస్తారా? పవన్ కల్యాణ్ దీనికి బాధ్యత వహిస్తారా? అని నిలదీశారు. మహిళలను గౌరవించని సమాజం ఎక్కడా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని అన్నారు.