BCCI: ఐసీసీ నుండి భారత్కు 72 శాతం పెరిగిన నిధులు!: బీసీసీఐ సెక్రటరీ జైషా
- ఇప్పటి వరకు ఐసీసీ ఆదాయంలో బీసీసీఐకి 22.4 శాతం వాటా
- ఇప్పుడు 38.5 శాతానికి పెరగడంతో 230 మిలియన్ డాలర్లు
- నాలుగేళ్ల పాటు అమలులో కొత్త రెవెన్యూ విధానం
భారత క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుండి వచ్చే ఆదాయం 72 శాతం మేర పెరిగిందని బీసీసీఐ సెక్రటరీ జైషా అన్నారు. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలతో జరిగిన సమావేశంలో ఆయన వెల్లడించారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో జరిగిన ఐసీసీ సర్వసభ్య సమావేశంలో కొత్త రెవెన్యూ విధానానికి ఆమోద ముద్ర లభించినట్లు చెప్పారు.
ఇప్పటి వరకు ఐసీసీ ఆదాయంలో బీసీసీఐ 22.4 శాతం వాటాను దక్కించుకోగా, ఇక నుండి 38.5 శాతం రానుంది. దీంతో బీసీసీఐ ఆదాయం 72 శాతం పెరిగినట్లే. ఇది సమష్టి కృషితో సాధ్యమైందని జైషా అన్నారు. ఈ నిధులను క్రీడల అభివృద్ధి కోసం వినియోగిస్తామని తెలిపారు.
38.5 శాతానికి పెరగడంతో 2024-27 మధ్య వార్షిక ఆదాయం 230 మిలియన్ డాలర్లకు చేరుకోనుంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రెండువేల కోట్ల రూపాయలు. ఈ కొత్త రెవెన్యూ విధానం నాలుగేళ్ల పాటు అమలులో ఉంటుంది.