Jagadeesh reddy: అప్పుడు చంద్రబాబును బయటపడేసిన వ్యక్తి ఇప్పుడు కరెంట్ విషయంలో కాంగ్రెస్ అంతరంగాన్ని బయటపెట్టాడు: రేవంత్‌పై మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శ
- 24 గంటల ఉచిత కరెంటు విషయంలో చర్చ ఎందుకు తెచ్చారని ప్రశ్న
- దొరికిపోయిన దొంగను తప్పించేందుకు కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతున్నదన్న మంత్రి
- కాంగ్రెస్ పార్టీ కుట్రనే పీసీసీ అధ్యక్షుడి నోటి నుండి బయటకు వచ్చిందని విమర్శ
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతాంగానికి ఉచిత కరెంట్ విషయంలో రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు విషయంలో చర్చ ఎందుకు తెచ్చారు ? ఎవరు తెచ్చారు? అని ప్రశ్నించారు. వ్యాపార, వాణిజ్య, పరిశ్రమలు, ఇళ్లకు 24 గంటల కరెంట్ ఉండొచ్చు కానీ, రైతాంగానికి కరెంటు సరఫరా విషయంలో చర్చ ఎందుకన్నారు. రైతాంగం, ప్రజలు ఈ విషయంలో ఆలోచించి, వారి కుట్రలను అర్ధం చేసుకోవాలని సూచించారు. గతంలో తొందరపాటుతో చంద్రబాబును బయటపడేసిన వ్యక్తి నేడు కరెంటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అంతరంగాన్ని బయటపెట్టాడని విమర్శించారు.
‘రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామని ఏ కాంగ్రెస్ నాయకుడు అయినా చెప్పిన దాఖలాలు ఉన్నాయా ? 9 గంటలు ఇస్తామని ఆరు గంటలు కూడా ఇవ్వడం లేదని రైతులు ధర్నాలు చేసిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కరెంటు కోసం ఎన్ని ధర్నాలు, ఎన్ని రాస్తారాకోలు ప్రజలకు తెలియదా ? ఏకంగా పారిశ్రామికవేత్తలే ధర్నా చేశారు’ అని దుయ్యబట్టారు. రైతాంగాన్ని చావగొట్టిన, పారిశ్రామికవేత్తలే పారిపోయేలా చేసిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు.
‘దొరికిపోయిన దొంగ తప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతున్నది. జాతీయ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో 24 గంటల ఉచిత కరెంట్ వెంటనే ప్రారంభించాలి. పీసీసీ అధ్యక్షుడు చేసిన తప్పుడు వ్యాఖ్యలను మరికొందరు పార్టీ నేతలు సమర్ధించడాన్ని ప్రజలు, రైతులు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ కుట్రనే పీసీసీ అధ్యక్షుడి నోటి నుండి బయటకు వచ్చింది. ఐదేళ్లుగా ఉచిత కరెంటు ఇస్తున్న కేసీఆర్ ఏంటో, అప్పుడే అధికారం రాక ముందే కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పన్నాగాన్ని రైతులు చర్చించుకోవాలి’ అని పిలుపునిచ్చారు.