Shashi Tharoor: ఇంటర్నెట్‌ను నిలిపేసే ఒకే ఒక్క ప్రజాస్వామ్య దేశం మనదే.. శశిథరూర్ ఫైర్

India only democracy that routinely shuts internet slatms Shashi Tharoor
  • కేంద్రంపై విరుచుకుపడిన కాంగ్రెస్ ఎంపీ
  • ఇంటర్నెట్‌ను నిషేధిస్తే అల్లర్లు అదుపులోకి వస్తాయనుకోవడం అపోహేనన్న శశిథరూర్
  • ఇంటర్నెట్ నిషేధం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువంటూ ట్వీట్
ఇంటర్నెట్‌ను ఎప్పుడు పడితే అప్పుడు మూసివేసే ఏకైక ప్రజాస్వామ్య దేశం భారత్ మాత్రమేనని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శించారు. ఎక్కడ ఏ చిన్న ఘర్షణలు జరిగినా అవి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తూ ఉంటుంది. కాగా, జాతుల మధ్య ఘర్షణలతో రెండు నెలలుగా అట్టుడుకుతున్న మణిపూర్‌లోనూ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. నిషేధాన్ని ఎత్తివేయాలంటూ మణిపూర్ హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు విచారించడానికి ఒక రోజు ముందు శశిథరూర్ తాజాగా చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ చైర్మన్‌గా ఉన్న శశిథరూర్ మాట్లాడుతూ.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత హింసను అడ్డుకున్నట్టు ఎలాంటి ఆధారాలు కమిటీకి లభ్యం కాలేదన్నారు. ఇంటర్నెట్ సేవల నిలిపివేత వల్ల ఉపయోగం కంటే ప్రజలకు కలిగే అసౌకర్యమే ఎక్కువని తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది రిఫ్లెక్సివ్ బ్యూరోక్రటిక్ చర్య తప్ప మరోటి కాదని విమర్శించారు. 

ఇంటర్నెట్ ఇప్పుడు ప్రజల జీవితాలతో మమేకం అయిందని, బ్యాంకింగ్, క్రెడిట్‌కార్డు లావాదేవీలు, ఎన్‌రోల్‌మెంట్లు, ఎగ్జామ్స్ వంటివన్నీ ఇంటర్నెట్‌పైనే ఆధారపడి ఉన్నాయన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు పౌరుల తరపున నిలబడుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి భయంకరమైన చర్యలకు కోర్టు ఇప్పుడే ముగింపు పలకాలని కోరుకుంటున్నట్టు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

మణిపూర్‌లో ప్రభుత్వం ఇంటర్నెట్‌పై విధించిన నిషేధాన్ని తొలగించాలంటూ మణిపూర్ హైకోర్టు ఈ నెల 7న ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రేపు దీనిపై విచారణ జరగనుంది.
Shashi Tharoor
Internet
Manipur
Congress

More Telugu News