Karnataka: వీరుడంటే ఇతనే.. దాడి చేసిన చిరుతను బైక్ మీద బంధించి తీసుకెళ్లి ఫారెస్ట్ అధికారులకు ఇచ్చేశాడు.. వీడియో ఇదిగో!
- కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఘటన
- తనపై దాడికి ప్రయత్నించిన చిరుతతో పోరాడిన యువకుడు
- కాళ్లను తాడుతో బంధించి అటవీ అధికారులకు అప్పగించిన ధైర్యశాలి
చిరుత పులిని చూస్తేనే భయం పట్టుకుంది. అది దగ్గరకు వచ్చిందంటే భయంతో చెమటలు పట్టేస్తాయి. అది మనపై దాడి చేసిందా ఇక అంతే సంగతులు. కానీ, తనపై దాడి చేసిన చిరుత పులిని బంధించిన ఓ యువకుడు బైక్ మీద తీసుకెళ్లి అటవీశాఖ అధికారులకు అప్పగించాడు. కర్ణాటకలో జరిగిందీ సంఘటన. కర్ణాటక హాసన్ జిల్లాలోని అరసీకెరె తాలూకా గండాసి హోబ్లీ బాగివాలు గ్రామానికి చెందిన వేణుగోపాల్ అలియాస్ ముత్తు అనే యువకుడు శుక్రవారం ఉదయం పొలానికి వెళ్తుండగా చిరుతపులి దాడి చేసింది. ఆ యువకుడు ధైర్యం చేసి చిరుతతో పోరాడాడు.
తప్పించుకొని వెళ్తున్న దాన్ని బైక్‌తో వెంబడించి మరీ పట్టుకున్నాడు. తన దెబ్బకు స్పృహ కోల్పోయిన చిరుత నాలుగు కాళ్లను తాడుతో చుట్టి బంధించాడు. బెక్ వెనకాల వేసుకొని వెళ్లి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అటవీశాఖ సిబ్బంది చిరుతకు చికిత్స చేయించారు. ఆ యువకుడు చిరుతను బైక్ పై కట్టి తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు యువకుడి ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు.