Tamilisai Soundararajan: ఎప్పటిలాగే ఈసారి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆహ్వానం రాలేదు: తమిళిసై
- తెలంగాణ ప్రజలకు బోనాలు శుభాకాంక్షలు తెలియజేసిన తమిళిసై
- రాజ్ భవన్ మహిళలు బోనాలకు ఆహ్వానించారని వెల్లడి
- నల్లపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించిన గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై.. రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలను అమ్మవారు చల్లగా చూడాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ రోజు రాజ్ భవన్ లో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా తమిళిసై బోనం ఎత్తుకున్నారు. రాజ్ భవన్ లోపల నుంచి బయట వరకు ఊరేగింపుగా బోనాన్ని గవర్నర్, మహిళా సిబ్బంది తీసుకొచ్చారు. నల్లపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించి వడి బియ్యం పోశారు.
తర్వాత తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బోనాల పండుగకు నాకు ఎలాంటి అధికారిక ఆహ్వానం అందలేదు. రాజ్ భవన్ మహిళలు మాత్రమే నన్ను బోనాలకు ఆహ్వానించారు” అని వివరించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆహ్వానం రాలేదని తమిళిసై చెప్పారు. రాజ్‌భవన్ పరివార్తోనే వేడుకలు చేసుకున్నానని తెలిపారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా బోనాలు జరుపుకొంటున్నారని.. ప్రజలకు అన్ని సౌకర్యాలూ అందాలని అమ్మవారిని కోరుకున్నట్లు గవర్నర్ తెలిపారు. మరోవైపు చంద్రయాన్-3ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.