Electric Buses: త్వరలో హైదరాబాద్ రోడ్లపై పరుగులు తీయనున్న ఎలక్ట్రిక్ బస్సులు
- హైదరాబాదులో ఎలక్ట్రిక్ బస్సులు తిప్పనున్న టీఎస్ఆర్టీసీ
- రూట్లను నిర్ణయించిన అధికారులు
- మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు లేని మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సులు
- ఐటీ కారిడార్ ను అనుసంధానం చేసేలా రూట్లు ఖరారు
పర్యావరణ పరిరక్షణ, ఇంధన ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యత పెరుగుతోంది. హైదరాబాదు నగరంలో విద్యుత్ ఆధారిత బస్సులను తీసుకువచ్చేందుకు టీఎస్ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. మరో రెండు వారాల్లో ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ నగరంలో రోడ్డెక్కనున్నాయి.
ఈ ఎలక్ట్రిక్ బస్సులు తిరిగే రూట్లను టీఎస్ఆర్టీసీ అధికారులు ఖరారు చేశారు. మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు లేని మార్గాల్లో, ఐటీ కారిడార్ ను అనుసంధానం చేసేలా రూట్లను నిర్ణయించారు.
ఈ ఎలక్ట్రిక్ బస్సులను తొలి విడతగా మియాపూర్, కంటోన్మెంట్ డిపోలకు కేటాయిస్తున్నారు. కంటోన్మెంట్ డిపోకు కేటాయించే బస్సులు... జేబీఎస్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం రూట్లోనూ.... 47ఎల్ నెంబరుపై సికింద్రాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, ఫిలింనగర్, ఉస్మానియా కాలనీ, మణికొండ రూట్లోనూ తిరగనున్నాయి.
మియాపూర్ డిపోకు కేటాయించే బస్సులు... బాచుపల్లి, జేఎన్టీయూ, కేపీహెచ్ బీ, హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, వేవ్ రాక్ రూట్లోనూ... ప్రగతి నగర్, జేఎన్టీయూ, హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, వీబీఐటీ రూట్లో తిరగనున్నాయి.