Liver: ఈ ఐదు శరీర భాగాల్లో వాపు కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా...!

Liver failure may causes swelling in five body parts

  • అప్పుడప్పుడు శరీర భాగాల్లో వాపు
  • తొడలు, పిక్కలు, మడమలు, చేతివేళ్లు, పొట్ట భాగాల్లో వాపు కనిపిస్తే డేంజర్
  • లివర్ సిర్రోసిస్ కు సంకేతాలంటున్న వైద్య నిపుణులు
  • ఏమాత్రం అజాగ్రత్తగా ఉండరాదని వెల్లడి

మానవ దేహం అనేక సంక్లిష్ట వ్యవస్థల సమాహారం. ఈ వ్యవస్థలో ఎక్కడ అనారోగ్యం తలెత్తినా, అది ఇతర భాగాలపై ప్రభావం చూపుతుంది. మన శరీర భాగాల్లో అప్పుడప్పుడు వాపు కనిపించడం తెలిసిందే. 

అయితే, ప్రత్యేకించి మన దేహంలోని 5 భాగాల్లో వాపు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాల్సిందేనని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తొడలు, పిక్కలు, మడమలు, చేతి వేళ్లు, పొట్ట భాగాల్లో వాపు కనిపిస్తే దాన్ని తేలిగ్గా తీసుకోరాదు. ఆ వాపులు కాలేయం తీవ్ర అనారోగ్యం బారిన పడిందనడానికి సంకేతాలుగా భావించాల్సి ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారిలో ఈ వాపులు కనిపిస్తాయి. 

శరీరంలో అత్యంత కీలక అవయవం కాలేయం. ఇది మానవ దేహంలో 500కి పైగా జీవ క్రియలకు తోడ్పాటు అందిస్తుందంటే నమ్మలేం... కానీ ఇది నిజం. తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం, వ్యాధులతో పోరాటం, రక్తం నుంచి విషపూరిత మలినాలను తొలగించడం వంటి అత్యంత కీలక చర్యలను కాలేయం నిర్వర్తిస్తుంది. అలాంటి కాలేయానికి ఏదైనా హాని జరిగితే దాని ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. 

సరైన ఆహారపు అలవాట్లు లేనివారిలో, చెడు తిండ్లు తినేవారిలో, శరీరానికి తగినంత వ్యాయామం లేనప్పుడు, అధిక బరువుతో బాధపడేవారిలో కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఈ పరిస్థితిని ఫ్యాటీ లివర్ గా పరిగణిస్తారు. 

ఫ్యాటీ లివర్ కారణంగా... కాలేయం పనితీరు మందగించి శరీర జీవక్రియలు అస్తవ్యస్తం అవుతాయి. సిర్రోసిస్ అనేది ఫ్యాటీ లివర్ లో చివరి దశ. ఇది ప్రాణాంతకమైనది. కాలేయం సిరోసిస్ దశకు చేరుకున్నప్పుడు శరీరంలో ఐదు భాగాల్లో వాపు కనిపిస్తుంది. 

కాలేయం సరిగా పనిచేయనప్పుడు, పరిమాణంలో మరింత పెరిగినప్పుడు నరాలపై ఒత్తిడి పడుతుంది. కాలేయంలో రక్త సరఫరాకు అవాంతరాలు ఏర్పడతాయి. దాంతో కిడ్నీలకు రక్త సరఫరా తగ్గడం, కిడ్నీలు రక్తంలో పేరుకుపోయిన అధికమోతాదులో ఉన్న లవణాలను తొలగించలేకపోవడం జరుగుతుంది. ఈ కారణంగానే తొడలు, పిక్కలు, మడమలు, పొట్ట, చేతి వేళ్లలో వాపు ఏర్పడుతుంది. 

చాలామంది పొట్ట ఉబ్బినప్పుడు గ్యాస్ సమస్య అనుకుంటారు. సుదీర్ఘకాలం పాటు పొట్ట ఉబ్బుగా ఉంటే లివర్ సిరోసిస్ కోణంలోనూ దీన్ని పరిశీలించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

లివర్ సిర్రోసిస్ కు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే అది క్యాన్సర్ గానూ, లివర్ ఫెయిల్యూర్ గానూ పరిణమించి ప్రాణాలు పోయేందుకు దారితీస్తుంది. అందుకే, ఈ ఐదు శరీర అవయవాల్లో వాపు కనిపిస్తే వెంటనే వైద్యుడ్ని సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకోవాలి.

  • Loading...

More Telugu News