Mamata Banerjee: దటీజ్ మమతా బెనర్జీ.. కాంగ్రెస్, ఆప్ ల మధ్య సమస్యను ఎలా పరిష్కరించారంటే..!

Mamata Banerjee solved issue between Congress and AAP
  • ఢిల్లీ ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ మౌనం వహించడంతో బెంగళూరు సమావేశానికి రాలేమన్న ఆప్
  • ఖర్గే కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించిన మమత
  • ఆర్డినెన్స్ పై నిర్ణయం తీసుకోకపోతే కూటమి కూలిపోయే అవకాశం ఉందని దీదీ హెచ్చరిక
  • ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్నామని ప్రకటించిన కాంగ్రెస్
ఓ వైపు బీజేపీని ఓడించడానికి దేశంలోని ప్రధాన విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు ఢిల్లీలోని ఉన్నతోద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తేనే తాము కూటమిలో ఉంటామని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేయడంతో విపక్షాల ఐక్యతపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. 

జూన్ 23న పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశానికి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను జాతీయ పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకించాలని ఆయన కోరారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఆర్డినెన్స్ ను వ్యతిరేకించకూడదని కాంగ్రెస్ ఢిల్లీ నేతలైన అజయ్ మాకెన్ వంటి వారు చెప్పడంతో ఆ పార్టీ మౌనంగా ఉండిపోయింది. 

ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ పై స్పష్టమైన ప్రకటన రాకపోతే తాము మరో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆప్ హెచ్చరించింది. మరోవైపు, పంజాబ్ లో యాంటీ కరప్షన్ క్యాంపెయిన్ ను సీఎం భగవంత్ సింగ్ మాన్ ప్రారంభించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, పంజాబ్ మాజీ మంత్రి ఓపీ సోనీని అవినీతి ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఇంకోవైపు బెంగళూరులో జరిగే విపక్షాల సమావేశానికి హాజరుకావాలని కేజ్రీవాల్ కు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారు. అయినప్పటికీ కేజ్రీవాల్ మౌనంగా ఉండిపోయారు. దీంతో, పరిస్థితులు తారుమారు అయ్యే స్థితి తలెత్తింది. 

ఇదే సమయంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రంగంలోకి దిగారు. వీరిద్దరూ కాంగ్రెస్ అగ్ర నేతలతో మాట్లాడారు. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడకపోతే... విపక్ష కూటమి కూలిపోయే అవకాశాలు ఉన్నాయని వారికి తెలిపారు. ఖర్గేతో మమత నేరుగా మాట్లాడి పరిస్థితిని వివరించారు. 

దీదీ మాట్లాడిన వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులను తమ నియంత్రణలోకి తెచ్చుకునేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని ఆయన స్పష్టం చేశారు. వేణుగోపాల్ ప్రకటన వెలువడిన వెంటనే బెంగళూరులోని విపక్షాల సమావేశానికి వెళ్తున్నట్టు ఆప్ ప్రకటించింది. 

ఢిల్లీ ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసిందని... ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపిందని ఆప్ నేత రాఘవ్ ఛద్దా తెలిపారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని... బెంగళూరులో జరిగే విపక్ష సమావేశానికి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ బృందం హాజరవుతుందని ఆయన చెప్పారు. సరైన సమయంలో మమత రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దడంతో సమస్య టీకప్పులో తుపానులా ముగిసిపోయింది.
Mamata Banerjee
TMC
Congress
Mallikarjun Kharge
AAP
Arvind Kejriwal
Opposition Unity

More Telugu News