Gadikota Srikanth Reddy: పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు ఉపయోగించుకొని ఎందుకూ పనికిరాకుండా చేస్తాడు: వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి
- చంద్రబాబు చేతిలో తదుపరి బలిపశువు పవన్ కల్యాణేనని విమర్శ
- చంద్రబాబు ట్రాప్ లో పవన్ కల్యాణ్ పడ్డారని విమర్శలు
- వాలంటీర్ వ్యవస్థపై ఉన్మాదిలా మాట్లాడుతున్నారని ధ్వజం
- రాయలసీమకు బాబు అన్యాయం చేసినప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీత
జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ట్రాప్‌లో పడ్డారని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి సోమవారం మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థపై ఆయన ఉన్మాదిలా మాట్లాడుతున్నారన్నారు. పవన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని విమర్శలు గుప్పించారు. అసలు పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. ఆటలో అరటిపండులా రాజకీయాల్లో పవన్ ను చంద్రబాబు బొమ్మలా వాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ట్రాప్‌లో పడిన పవన్ రోజురోజుకు దిగజారి మాట్లాడుతున్నారని, ఓ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇలా ట్రెయినింగ్ ఇవ్వడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గతంలో చాలామంది సీనియర్లు చంద్రబాబు చేతిలో బలిపశువులుగా మారారని అన్నారు. ఇలా మాట్లాడించి వారిపట్ల ప్రజల్లో చులకన చేయించే వరకు వదలరన్నారు. తనకు పోటీ అవుతారని భావించే పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తులందరినీ ఇలా ఉపయోగించుకొని చివరకు వారిని ఎందుకూ పనికి రాకుండా చేస్తారని దుమ్మెత్తి పోశారు. అందులో భాగంగానే తదుపరి బలిపశువు జనసేనాని అన్నారు. తనకు అవకాశమిస్తే ప్రజలకు ఏం చేస్తానో పవన్ చెప్పడం లేదని, టీడీపీ తప్పులను ఎత్తి చూపడం లేదన్నారు. చంద్రబాబును అంటే వ్యక్తిగత దూషణకు దిగుతున్నాడన్నారు. రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేసినప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు.
తాను ఏ రోజూ పవన్ పేరు కూడా ఉచ్చరించకూడదని అనుకున్నానని, రోజు ఆయన జగన్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తుంటారని, అయినా తాను మాట్లాడకూడదని అనుకున్నట్లు చెప్పారు. కానీ ఇటీవల పవన్ తన పేరు తీసుకువస్తున్నారని, జగన్ తో కలిసి తాను పేపర్లు దొంగిలించడం వల్ల హైదరాబాద్ లో కేసు బుక్ చేసినట్లు ఆరోపణలు చేశారని, టీడీపీ రాసిన స్క్రిప్ట్ చదివితే ఎలా? అని పవన్ ను ప్రశ్నించారు. విమర్శించే సమయంలో.. ఆరోపణలు చేసే సమయంలో అన్ని వివరాలు తెలుసుకోవాలని జనసేనానికి సూచించారు. పవన్ చాలా దిగజారిపోతున్నారన్నారు. రాజకీయాల్లో హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని సూచించారు. రాజకీయాలు అంటే బాధ్యత అని, కానీ అలా కాకుండా ఊగిపోవడం, అరవడం, తిట్టడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు.
వ్యక్తిగతంగా ఎలా దూషించాలా అనే రీతిలో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన జీవితమంతా వెన్నుపోట్లకే పరిమితమయ్యారన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఎప్పుడూ రాజకీయ విలువలు పాటించలేదన్నారు. ప్రజలు టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించిన తర్వాత కూడా పశ్చాత్తాపపడటం లేదన్నారు. ఓటమిని ఏ రోజూ అంగీకరించలేదని, కేవలం అధికారంలోకి రావడమనే ఏకైక సూత్రం పాటిస్తున్నారని, అందుకు పచ్చమీడియా మద్దతు ప్రకటిస్తోందని విమర్శించారు.
బీజేపీ, కాంగ్రెస్ తో పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్న పవన్, చంద్రబాబులను ఆ పార్టీలు దూరం పెడుతున్నాయన్నారు. ఒంటరిగా తాము 175 సీట్లలో పోటీ చేస్తామని ఆ పార్టీలు చెప్పలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ ఇష్టారీతిగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లలో 60 శాతం మంది మహిళలు ఉన్నారని, అలాంటి వారి పట్ల సిగ్గులేకుండా విమర్శలు చేశారన్నారు. మహిళా సీఐపై ఫిర్యాదు చేసేందుకు రాయలసీమకు వచ్చిన పవన్ ఊగిపోయారని ఎద్దేవా చేశారు.