Mystery: కాల్వలో కనిపించిన కారు.. యజమాని ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న మిస్టరీ!

Man Missing After Car Found In Canal In Krishna District
  • కృష్ణా జిల్లా పెదపులిపాకలో కాల్వలో కనిపించిన కారు
  • డ్రైవర్ సీటు కింద జత దుస్తులు
  • కారు యజమాని అవనిగడ్డకు చెందిన గాజుల రత్న భాస్కర్‌గా గుర్తింపు
  • మచిలీపట్టణం వెళ్తున్నట్టు చెప్పి పెదపులిపాక రావడంపై అనుమానాలు?
  • ఫోన్ స్విచ్ఛాఫ్.. గాలిస్తున్న పోలీసులు
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక వద్ద నిన్న తెల్లవారుజామున ఓ కాల్వలో కారు మునిగిపోయి కనిపించింది. అటుగా వెళ్తున్న లారీ డ్రైవర్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కారును బయటకు తీసి పరిశీలించారు. అప్పటికే కారు డోర్ తెరిచి ఉంది. డ్రైవర్ సీటు కింద జత దుస్తులు కనిపించాయి. కారులో ఉన్న పత్రాలను బట్టి కారును అవనిగడ్డకు చెందిన గాజుల రత్న భాస్కర్(43)దిగా గుర్తించారు. బంటుమిల్లి సమీపంలోని రామవరపుమూడిలో ఆయన ఐస్‌కోల్డ్ స్టోరేజీ నిర్వహిస్తారు. అయితే, కారులో ఆయన కనిపించకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మచిలీపట్టణంలో జరుగుతున్న ఓ రాజకీయ పార్టీ సమావేశానికి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, మచిలీపట్టణం వెళ్లిన ఆయన పెదపులిపాక ఎందుకు వచ్చారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఉద్దేశపూర్వకంగానే కారును కాల్వలో తోసి అదృశ్యమయ్యారా? లేదంటే, కిడ్నాప్ అయ్యారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే, కారులో ఆయనతోపాటు ఇంకెవరైనా ఉన్నారా? అన్నది కూడా ఆరా తీస్తున్నారు. శనివారం రాత్రి 7.30 గంటల వరకు ఆయన మచిలీపట్టణంలోనే ఉన్నట్టు ఆయన సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను బట్టి గుర్తించారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ అయింది. కారు డోర్ తెరిచి ఉండడంతో కాల్వలో ఆయన గల్లంతయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Mystery
Pedapulipaka
Krishna District

More Telugu News