Narendra Modi: వారికి కుటుంబం మాత్రమే ముఖ్యం.. దేశం కాదు: ప్రతిపక్షాలపై మోదీ విసుర్లు
- విపక్ష నేతలను కరుడుగట్టిన అవినీతిపరులుగా సంబోధించిన మోదీ
- అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకేకి విపక్ష పార్టీలు క్లీన్ చిట్ ఇచ్చాయని విమర్శ
- పేద ప్రజల పిల్లల భవిష్యత్తుపై వారికి ఆందోళన లేదని మండిపాటు
విపక్ష పార్టీలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారి దృష్టి మొత్తం కుటుంబంపైనే ఉంటుందని, దేశంపై ఉండదని విమర్శించారు. కుటుంబ ప్రయోజనాలు తప్ప, దేశ ప్రయోజనాలు వారికి పట్టవని అన్నారు. అవినీతే వారికి ప్రేరణ అని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలచే, ప్రజల చేత, ప్రజల కోసం అని అర్థమని... కానీ వీళ్ల దృష్టిలో కుటుంబంచే, కుటుంబం చేత, కుటుంబం కోసమని విమర్శించారు.
అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ లో నూతనంగా నిర్మించిన వీర్ సావర్కర్ ఎయిర్ పోర్టును ఈరోజు ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్షాలకు చెందిన 26 పార్టీలు బెంగళూరులో సమావేశమైన నేపథ్యంలో ఆయన ఈ మేరకు విమర్శలు గుప్పించారు. విపక్ష నేతలను కరుడుగట్టిన అవినీతిపరులుగా సంబోధించారు.
అవినీతిని ప్రమోట్ చేయడానికే విపక్ష నేతలు సమావేశమయ్యారని ప్రజలు అనుకుంటున్నారని మోదీ అన్నారు. తమిళనాడులో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న డీఎంకేకి విపక్ష పార్టీలు క్లీన్ చిట్ ఇచ్చాయని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో వారి కేడర్ పై దాడులు జరిగినా కాంగ్రెస్, వామపక్షాలు మౌనంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. పేద ప్రజల పిల్లల అభివృద్ధి, భవిష్యత్తుపై విపక్షాలకు ఎలాంటి ఆందోళన లేదని చెప్పారు. విపక్షాల ఉమ్మడి కనీస కార్యక్రమం వారి కుటుంబాల అవినీతిని పెంచుకోవడానికేనని విమర్శించారు.