Artifacts: భారత్ నుంచి పలు సందర్భాల్లో తరలించిన 105 కళాఖండాలను తిరిగి అప్పగించిన అమెరికా
- ఇటీవల అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన
- అపురూవ వస్తువులు తిరిగిచ్చేస్తామని అమెరికా హామీ
- న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ లో కార్యక్రమం
- కళాఖండాల అప్పగింతలు పూర్తి చేసిన అమెరికా అధికారులు
ప్రాచీన కాలం నుంచి భారత్ విలువైన వస్తు సంపదకు నిలయమన్న సంగతి తెలిసిందే. అయితే, కొన్ని శతాబ్దాలుగా అనేక విలువైన కళాఖండాలు దేశం దాటి పోయాయి. కోహినూర్ వజ్రం, టిప్పు సుల్తాన్ ఖడ్గం వంటి వెలకట్టలేని వస్తువులు ఈ కోవలోకి వస్తాయి.
ఈ నేపథ్యంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది. వివిధ సందర్భాల్లో భారత్ నుంచి తరలించిన 105 కళాఖండాలను అమెరికా తిరిగి అప్పగించింది. ఇవాళ న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధూకు వాటిని అమెరికా అధికారులు అందజేశారు.
ఈ అపురూప వస్తువుల్లో తూర్పు భారతదేశానికి చెందినవి 47, మధ్య భారతదేశానికి చెందినవి 22, ఉత్తర భారతదేశానికి చెందినవి 6, దక్షిణ భారతదేశానికి చెందినవి 27, పశ్చిమ భారతదేశానికి చెందినవి 3 ఉన్నాయి.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించడం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో, ఆ కళాఖండాలను తిరిగి భారత్ కు ఇచ్చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది.