Sri Ramana: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ కథా రచయిత శ్రీరమణ కన్నుమూత
- ఈ తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచిన శ్రీరమణ
- గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వైనం
- 'మిథునం' సినిమాకు కథను అందించిన శ్రీరమణ
టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు మృతి విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే చిత్ర రంగంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సినీ రచయిత, వ్యంగ్య వ్యాసకర్త శ్రీరమణ (కామరాజు రామారావు) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన... ఈ తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 70 ఏళ్లు. జాతీయ అవార్డు అందుకున్న 'మిథునం' సినిమాకు కథను ఆయనే అందించారు. తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలైన బాపు, రమణలతో కలిసి ఆయన పని చేశారు.
2014లో హాస్య రచన విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆయన కీర్తి పురస్కారాన్ని అందుకున్నారు. 'పత్రిక' అనే మాస పత్రికకు ఆయన గౌరవ సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. కాలమిస్టుగా, కథకుడిగా, సినీ రంగంలో నిర్మాణ నిర్వహణ పరంగా ఆయన పేరుగాంచారు. ఇదే సమయంలో సాహిత్య, కళారంగాల్లో తనదైన సేవ చేశారు. శ్రీరమణది గుంటూరు జిల్లా వేమూరు మండలం వరహాపురం అగ్రహారం. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.