New Delhi: నడివీధిలో మహిళా పైలట్‌కు దేహశుద్ధి
- ఢిల్లీలో వెలుగు చూసిన ఘటన
- పదేళ్ల బాలికను ఇంటి పనులకు నియమించుకున్న మహిళా పైలట్
- బాలికను చూసేందుకు వచ్చిన బంధువు. చిన్నారి ఒంటిపై గాయాల గుర్తింపు
- చిన్నారిని పైలట్ హింసించిందని గుర్తించడంతో చెలరేగిన వివాదం
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బాలికపై లైంగిక దాడి జరగలేదని వెల్లడి
ఇంట్లో పనిలో పెట్టుకున్న పదేళ్ల బాలికతో అమానవీయంగా ప్రవర్తించిన ఓ మహిళా పైలట్‌కు సదరు బాలిక బంధువులు, స్థానికులు నడివీధిలో దేహశుద్ధి చేశారు. సారీ సారీ.. అంటూ పైలట్ క్షమాపణలు చెబుతున్నా పట్టించుకోకుండా చేయి చేసుకున్నారు.
ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో నివసించే ఓ మహిళ పైలట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఆమె భర్త కూడా ఓ ఎయిర్‌లైన్స్ ఉద్యోగే. కాగా, రెండు నెలల క్రితం వారు ఇంటిపనుల కోసం ఓ బాలికను పనిలో పెట్టుకున్నారు.
చిన్నారిని చూసేందుకు బుధవారం ఆమె బంధువు పైలట్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా బాలిక ఒంటిపై ఉన్న గాయాలను గమనించారు. పైలట్, ఆమె భర్త బాలికను హింసించినట్టు గుర్తించారు. ఈలోపు విషయం చిన్నారి తల్లిదండ్రులకు, స్థానికులకు తెలియడంతో వారు ఆమెను ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి దేహశుద్ధి చేశారు. ఈలోపు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, బాలికపై లైంగిక దాడి జరగలేదని వారు చెప్పారు.