Abu Dhabhi Temple: అబుదాబిలో 27 ఎకరాల్లో హిందూ ఆలయం.. ప్రారంభోత్సవం ఎప్పుడంటే..!
- అబు మరీఖాలో పింక్ శాండ్‌స్టోన్‌తో నిర్మాణం
- మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద సంప్రదాయ మందిరంగా గుర్తింపు
- వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ప్రారంభోత్సవం
- ప్రపంచ సామరస్యానికి ఆధ్యాత్మిక ఒయాసిస్ అవుతుందన్న యూఏఈ
- సామరస్య పండుగలా ప్రారంభోత్సం
అబుదాబిలోని అబు మరీఖాలో 27 ఎకరాల్లో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు బీఏపీఎస్ హిందూ మందిర్ ప్రతినిధులు తెలిపారు. మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద సంప్రదాయ రాతి మందిరమైన ఈ ఆలయ ప్రారంభోత్సవాన్ని అతిపెద్ద సామరస్య పండుగలా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. బీఏపీఎస్ మందిరం ప్రపంచ సామరస్యానికి ఆధ్యాత్మిక ఒయాసిస్ అవుతుందని, ఈ పండుగ భారతదేశ కళలు, విలువలు, సంస్కృతిని తీసుకొచ్చే వేడుక అవుతుందని యూఏఈ పేర్కొంది.
బీఏపీఎస్ ఆలయాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ప్రారంభించాలని నిర్ణయించారు. పూజ్య మహంత్ స్వామి మహరాజ్ నేతృత్వంలో వైదిక కార్యక్రమంతో ఈ మహా ఆలయాన్ని ప్రారంభించనున్నారు. లోతైన ఆధ్యాత్మికత, విశ్వాసం కలగలిసిన ఆధ్యాత్మిక వేడుక ఇదని మందిర ప్రతినిధులు పేర్కొన్నారు. అబుదాబిలోని భారతీయ సంఘం సభ్యులు ఫిబ్రవరి 15న స్వామి మహరాజ్ సమక్షంలో జరిగే ప్రజా సమర్పణ సభలో పాల్గొనేందుకు ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆలయ అధిపతి బ్రహ్మవిహారీదాస్ స్వామి పర్యవేక్షణలో నిర్మాణం పూర్తిచేసుకుంటున్న బీఏపీఎస్ హిందూ ఆలయం వచ్చే ఏడాది ఫిబ్రవరి 18 నుంచి సాధారణ భక్తులకు అందుబాటులో ఉంటుంది. అంతకుముందు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని ఆలయ ప్రతినిధులు పేర్కొన్నారు.
అబుదాబిలో హిందూ ఆలయ నిర్మాణానికి అనుమతినిస్తూ ఆగస్టు 2015లో యూఏఈ ప్రభుత్వం భూమి కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భూమిని బహుమానంగా ఇచ్చారు. ఫిబ్రవరి 2018లో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. పింక్ శాండ్‌స్టోన్‌తో నిర్మిస్తున్న ఈ ఆలయం వెయ్యేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుందని భావిస్తున్నారు.