viveka murder case: రాజకీయ కారణాలతోనే వివేకా హత్య.. వాంగ్మూలంలో షర్మిల కీలక వ్యాఖ్యలు!
- వివేకా హత్యకు ఆర్థిక వ్యవహారాలు కారణం కాదన్న షర్మిల
- అవినాశ్ కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడటమే కారణం కావొచ్చని వ్యాఖ్య
- ఎమ్మెల్సీగా వివేకా ఓటమికి అవినాశ్, భాస్కర్‌రెడ్డి, ఇతరులే కారణమని వెల్లడి
- కుటుంబంలో కోల్డ్‌వార్ ఉండేదని వాంగ్మూలం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకు ఆర్థిక వ్యవహారాలు కారణం కాదని, పెద్ద విషయం ఉందని అన్నారు. రాజకీయ కారణాలతోనే ఈ హత్య జరిగిందని చెప్పారు. ఈ మేరకు గతేడాది అక్టోబర్ 7న సీబీఐకి షర్మిల వాంగ్మూలమిచ్చారు. ఈ నేపథ్యంలో షర్మిలను 259వ సాక్షిగా పేర్కొంటూ కోర్టుకు ఆమె వాంగ్మూలాన్ని సీబీఐ సమర్పించింది.
‘‘నా వద్ద ఆధారాల్లేవు కానీ రాజకీయ కారణాలతోనే వివేకా హత్య జరిగింది. హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కారణాలు కాదు.. పెద్ద కారణం ఉంది. అవినాశ్ రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే కారణం కావొచ్చు. వారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకోవచ్చు” అని తన వాంగ్మూలంలో షర్మిల చెప్పారు.
‘‘హత్యకు కొన్ని నెలల ముందు బెంగళూరులోని మా ఇంటికి వివేకా వచ్చారు. కడప ఎంపీగా పోటీ చేయాలని ఆయన నన్ను అడిగారు. ఎంపీగా అవినాశ్ పోటీ చేయకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. అతడికి టికెట్ ఇవ్వకుండా ఎలాగైనా జగన్‌ను ఒప్పిద్దామని కోరారు” అని వివరించారు. అయితే ఎంపీగా పోటీకి మొదట తాను ఒప్పుకోలేదని, బాబాయ్ పదేపదే ఒత్తిడి చేయడంతో సరే అన్నానని వివరించారు.
‘‘ఎంపీగా వివేకా పోటీ చేయకుండా మీపై ఎందుకు ఒత్తిడి తెచ్చారు?” అని సీబీఐ ప్రశ్నించగా.. ‘‘బహుశా ఎమ్మెల్సీగా ఓడిపోయినందున ఎంపీగా పోటీకి ఆయన ఆసక్తి చూపకపోయుండవచ్చు. విజయమ్మపై వివేకా పోటీ చేశాక కొంతదూరం పెరిగింది. ఆ కారణంగా ఎలాంటి టికెట్ దక్కకపోవచ్చని వివేకా భావించారు” అని షర్మిల బదులిచ్చారు.
‘‘నాకు తెలిసినంతవరకు ఎమ్మెల్సీగా వివేకా ఓటమికి అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, కొందరు సన్నిహితులే కారణం. కుటుంబంలో అంతా బాగున్నట్లు బయటకు కనిపించినా.. లోపల కోల్డ్‌వార్ ఉండేది’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.