G. Kishan Reddy: I-N-D-I-A కూటమిలో ప్రధాని పదవి కోసం కాలుపట్టి గుంజుతారు: కిషన్ రెడ్డి
- ఎంతమంది కేసీఆర్, ఒవైసీ, రాహుల్ గాంధీలు వచ్చినా 2024లో మోదీని అడ్డుకోలేరని వ్యాఖ్య
- తెలంగాణలో బుల్డోజర్ పాలన రావాలన్న కిషన్ రెడ్డి
- నిజాం భవనాలను తలపించేలా ప్రగతి భవన్ కట్టుకున్నారని వ్యాఖ్య
వెయ్యిమంది కేసీఆర్లు, లక్షమంది ఒవైసీలు, లక్షమంది రాహుల్ గాంధీలు వచ్చినా 2024లో బీజేపీ గెలుపును ఆపలేరని, ప్రధాని నరేంద్రమోదీని అడ్డుకోలేరని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో బుల్డోజర్ ప్రభుత్వం రావాలన్నారు. కేసీఆర్ ఇక రోజులు లెక్కబెట్టుకోవాలని, మీ కుటుంబాన్ని ఇక ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తామని హెచ్చరించారు. మీ కుటుంబానికి బానిసలం కాదన్నారు. నిజాం భవనాలను తలపించేలా ప్రగతి భవన్ కట్టుకున్నారని ధ్వజమెత్తారు. పేద ప్రజల ఇళ్ల కోసం మాత్రం స్థలం, నిధులు ఉండవన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, పార్టీ కార్యాలయం కోసం పది ఎకరాలు ఇచ్చింది ఎవరు? తీసుకున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీని మించి బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందన్నారు. తాము ఏ పార్టీతోనే కలిసేది లేదని స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల తరఫున బీజేపీ యుద్ధం చేస్తుందని, మేం తెలంగాణలో ఒక్క అడుగు వెనుకకు వేశామంటే పది అడుగులు ముందుకేస్తామన్నారు.
మరోపక్క, ఇటీవల ఏర్పడిన I-N-D-I-A కూటమిపై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష పార్టీలలో ప్రధానమంత్రి ఎవరు అవుతారో తెలియదన్నారు. ఆ కూటమి అధికారంలోకి వస్తే మూడు నెలలకో ప్రధానమంత్రి మారుతారని ఎద్దేవా చేశారు. ఎవరినీ ఆ కుర్చీలో కూర్చోనివ్వరని, ఒకరు కాలు పట్టి గుంజితే, మరొకరు చేయిపట్టి లాగుతారన్నారు. ప్రజలు సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.