Pholcodine: ఈ ఔషధంపై కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది... ఎందుకంటే...!
- ఫాల్కోడైన్ వాడకంపై కేంద్రం హెచ్చరికలు
- సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం
- దగ్గుమందుగా ఫాల్కోడైన్ కు గుర్తింపు
కేంద్రం ఇటీవల ఫాల్కోడైన్ అనే దగ్గుమందు వాడొద్దంటూ హెచ్చరికలు చేసింది. ఈ దగ్గుమందు వాడకం నిలిపివేయాలని డాక్టర్లకు, రోగులకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) స్పష్టం చేసింది. ఫాల్కోడైన్ పనితీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీసీజీఐ రాజీవ్ రఘువంశి వెల్లడించారు.
ఈ ఔషధం తీవ్ర దుష్పరిణామాలు కలిగిస్తుందని, శ్వాస వ్యవస్థ స్తంభించిపోయేలా చేస్తుందని డబ్ల్యూహెచ్ఓ ఇటీవల హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, ఫాల్కోడైన్ ఔషధం పనితీరు, ఎవరికి ఇది ఔషధంగా పనిచేస్తుంది, ఎందుకు డబ్ల్యూహెచ్ఓ, డీసీజీఐ హెచ్చరికలు చేశాయన్న దానిపై నిపుణులు స్పందించారు.
గురుగ్రామ్ లోని సీకే బిర్లా ఆసుపత్రిలో కన్సల్టెంట్ డాక్టర్ సౌరభ్ కన్నా స్పందిస్తూ... ఆరేళ్ల వయసుకు పైబడిన బాలలకు, పెద్దవారికి ఈ ఔషధాన్ని వాడతారని, అధిక దగ్గుతో బాధపడుతున్న వారికి ఇది మందు అని తెలిపారు. అయితే, మోతాదుకు మించి వాడితే ఇది అత్యంత హానికరం అని వివరించారు.
మెదడులో ఉండే దగ్గును ప్రేరేపించే కేంద్రక భాగాన్ని ఇది అణచివేస్తుందని వెల్లడించారు. కొన్ని కండరాలను స్తంభింపజేసే ఔషధాలతో కలిపి ఫాల్కోడైన్ ను వాడడం ప్రమాదకరం అని, ఇది ప్రాణాంతకమైన అలర్జీకి దారితీస్తుందని వివరించారు. అన్ని రకాల దగ్గులకు ఫాల్కోడైన్ ఉపయోగించరని, కొన్ని ప్రత్యేక లక్షణాలతో కూడిన దగ్గుకు మాత్రమే ఫాల్కోడైన్ ఔషధాన్ని వైద్యులు సిఫారసు చేస్తుంటారని డాక్టర్ సౌరభ్ కన్నా తెలిపారు.
ఫాల్కోడైన్ ఔషధం శరీరంలోకి ప్రవేశించగానే తీవ్ర అలర్జీని కలిగించే యాంటీబాడీలు పెద్ద సంఖ్యలో తయారయ్యేందుకు కారణమవుతుందని, దీనివల్ల ఉత్పన్నమయ్యే అనఫిలాక్సిస్ దుష్పరిణామం మత్తు ఇచ్చిన దానికంటే 300 రెట్లు తీవ్రమైన మగతను కలిగిస్తుందని డాక్టర్ దూబే అనే మరో నిపుణుడు వెల్లడించారు. ఫాల్కోడైన్ వాడకం వల్ల ఏర్పడే యాంటీబాడీలు శరీరంలోంచి తొలగిపోయేందుకు అనేక సంవత్సరాలు పడుతుందని తెలిపారు.
ఈ దగ్గుమందు మోతాదు మించితే పేగుల్లో ఇబ్బందులు, వికారం, వాంతులు, తీవ్రమైన శ్వాస సంబంధ అసౌకర్యం కలుగుతుందని డాక్టర్ ఖన్నా పేర్కొన్నారు. కాగా, సైడ్ ఎఫెక్ట్ ల నేపథ్యంలో... ఫాల్కోడైన్ కు ప్రత్యామ్నాయ ఔషధాలను సూచించాలని రోగులు డాక్టర్లను కోరాలని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.