Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు ఉన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారు: పొంగులేటి
- బీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయిందన్న పొంగులేటి
- కాంగ్రెస్ వ్యక్తే సీఎం అవుతారని ధీమా
- కేసీఆర్ ను గద్దె దించేందుకు ప్రజలు తహతహలాడుతున్నారని వ్యాఖ్య
బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయిందని ఆయన చెప్పారు. ఎన్ని కాంక్రీట్ గోడలు కట్టినా, జిత్తులు వేసినా, వేల కోట్లు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని, కాంగ్రెస్ వ్యక్తే సీఎం అవుతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 25 నుంచి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని కేసీఆర్ ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు ఉన్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. భట్టి విక్రమార్క, రేణుకా చౌదరిలతో కలిసి పని చేస్తానని చెప్పారు. ఖమ్మం జిల్లాలో మొత్తం సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అధికార మదంతో విర్రవీగుతున్న ప్రజాప్రతినిధులను ఇంటికి పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ను గద్దె దించాలని ప్రజలు తహతహలాడుతున్నారని చెప్పారు.