Citizenship: ఈ ఏడాది ఇప్పటివరకు 87 వేల పైచిలుకు మంది భారత పౌరసత్వం వదులుకున్నారు: మంత్రి జైశంకర్
- లోక్‌సభలో లిఖితపూర్వకంగా వెల్లడించిన విదేశీవ్యవహారాల శాఖ మంత్రి
- 2011 నుంచి ఇప్పటివరకూ 17.50 లక్షల మంది భారత పౌరసత్వం వదులుకున్నట్టు వెల్లడి
- గత రెండు దశాబ్దాల్లో అనేక మంది వృత్తి ఉపాధి అవకాశాలా కోసం భారత్ వీడారన్న మంత్రి
ఈ ఏడాది ఇప్పటివరకూ 87 వేల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వం వదులుకున్నారని విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ లోక్ సభకు తెలిపారు. 2011 నుంచి ఇప్పటివరకూ మొత్తం 17.50 లక్షల మంది భారతీయ పౌరసత్వం వదులుకున్నారని అన్నారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా లోక్‌సభకు తెలియజేశారు.
‘‘గత రెండు దశాబ్దాలుగా అనేక మంది వ్యాపార ఉపాధి అవకాశాల కోసం దేశం విడిచివెళ్లారు. వీరిలో అనేక మంది వ్యక్తిగత కారణాలు, సౌలభ్యం కోసం భారత పౌరసత్వం వదులుకున్నారు’’ అని మంత్రి పేర్కొన్నారు.
భారత ప్రభుత్వం ద్వంద్వ పౌరసత్వం అనుమతించని కారణంగా విదేశాల్లోని అనేక మంది అక్కడ శాశ్వత నివాసార్హత కోసం భారత పౌరసత్వం వదులుకోవాల్సి వస్తోంది.
విదేశీ వ్యవహారాల మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, 2022లో 2,25,620 మంది భారతీయులు, 2021లో 1,63,370 మంది, 2020లో 85,256, 2019లో 1,44,017, 2018లో 1,34,561, 2017లో 1,33,049, 2016లో 1,41,603, 2015లో 1,31,489, 2014లో 1,29,328, 2013లో 1,31,405, 2012లో 1,20,923, 2011లో 1,22,819 మంది భారతీయులు తమ పౌరసత్వం వదులుకున్నారు.