TANKBUND: హుస్సేన్ సాగర్ కు భారీ వరద
- నిండుకుండలా మారిన సాగర్.. కిందికి నీటి విడుదల
- 513.62 మీటర్లకు చేరిన సాగర్ నీటిమట్టం
- లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు
హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. సాగర్ పుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 513.62 మీటర్లకు చేరింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు సాగర్ తూము గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మొత్తం నాలుగు తూముల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ స్వయంగా ట్యాంక్ బడ్ కు వెళ్లి పరిశీలించారు. సాగర్ నీటి మట్టం మరింత పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ముంపునకు గురయ్యే ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
వరద మరింత పెరిగితే మరిన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. వరదలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. డ్రైనేజ్ సమస్యలు, చెట్లు కూలిపోయిన సంఘటనలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు.