Godavari: ధవళేశ్వరం వద్ద గోదావరికి పోటెత్తుతున్న వరద
- ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు
- గోదావరి నదికి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు
- ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో 7.89 లక్షల క్యూసెక్కులు
- అదే స్థాయిలో నీరు దిగువకు విడుదల
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 7.89 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది.
ధవళేశ్వరం వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
కాటన్ బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే స్థాయిలో వరద నీరు చేరే అవకాశాలున్నాయని, గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.