Jagan: ఇక నుంచి ఇది మనందరి అమరావతి: ఏపీ సీఎం జగన్
- పేదలకు అండగా మార్పు మొదలైందన్న జగన్
- రాజధానిలో పేదలు ఉండకూడదా? అని ప్రశ్న
- ‘సామాజిక అమరావతి’గా పునాది రాయి వేస్తున్నానని వ్యాఖ్య
ఇక నుంచి అమరావతి మన అందరిదీ అని ఏపీ సీఎం జగన్ అన్నారు. పేదలకు అండగా మార్పు మొదలైందని చెప్పారు. ‘సామాజిక అమరావతి’గా ఇవాళ పునాది రాయి వేస్తున్నానని తెలిపారు. ఈ రోజు అమరావతి ప్రాంతంలోని కృష్ణాయపాలెంలో ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల ప్రాజెక్టులకు సీఎం భూమి పూజ చేశారు. తర్వాత వెంకటపాలెంలో బహిరంగ సభలో మాట్లాడారు.
‘‘ఇక ఇది సామాజిక అమరావతి.. మనందరిదీ. పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తే రాజధాని అభివృద్ధి చెందదని కొందరు వాదించారు. రాజధానిలో పేదలు ఉండకూడదా? అందుకే పేదలకు అండగా మార్పు మొదలైంది. ఇక నుంచి అమరావతి మన అందరిది” అని జగన్ చెప్పారు.
ఎన్నో అవరోధాలను అధిగమించి ఇళ్లు నిర్మిస్తున్నామని, పేదల విజయంతో ఈ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. మహిళా సాధికారకతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని, 50,793 మంది అక్కచెల్లెమ్మలకు వాళ్ల పేరు మీదనే ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు.