Raghunandan Rao: ఆ తర్వాత మేమే ఇళ్లలోకి పంపిస్తాం: కేసీఆర్‌కు రఘునందనరావు డెడ్‌లైన్
- నాలుగేళ్లు గడిచినా ఒక్క పేద కుటుంబానికి కూడా డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించలేదని ఆరోపణ
- ఎన్నికలకు ముందు తియ్యటి మాటలు చెబుతారని విమర్శలు
- కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాలో రఘునందనరావు
కామారెడ్డిలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి నాలుగేళ్లు గడిచినప్పటికీ ఒక్క పేద కుటుంబానికి కూడా కేటాయించలేదని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు ఎన్నో మాటలు చెప్పి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
ఓట్ల కోసం కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారని, కానీ అవి అమలు కావడం లేదని ఆరోపించారు. కులవృత్తుల వారికి రూ.1 లక్ష సాయం చేస్తే దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు బీఆర్ఎస్ వారే ఉంటారన్నారు. తియ్యటి మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఈ ఆగస్ట్ 30 నాటికి నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించకపోతే బీజేపీ తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తుందన్నారు. ఉధ్యమం ద్వారా కట్టిన ఇళ్లలోకి నిరుపేదలను పంపిస్తామన్నారు.