Mohammed Siraj: ఫ్లాట్ పిచ్ పై 5 వికెట్లు తీయడం పట్ల సిరాజ్ స్పందన

Mohammed Siraj opines on five wickets haul against West Indies
  • ట్రినిడాడ్ లో టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు
  • విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన సిరాజ్
  • విండీస్ లోయరార్డర్ పనిబట్టిన హైదరాబాదీ పేసర్
  • ఈ ఘనత ఫిట్ నెస్ ట్రైనర్ సోహెమ్ దేశాయ్ కి చెందుతుందని వెల్లడి
వెస్టిండీస్ తో రెండో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీయడం తెలిసిందే. ఒకప్పుడు వెస్టిండీస్ లో పిచ్ లు బౌలర్లకు స్వర్గధామం అనదగ్గ విధంగా ఉండేవి. ప్రస్తుతం కరీబియన్ దీవుల్లోని పిచ్ లు జీవం లేక, నిస్సారంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండో టెస్టుకు వేదికగా నిలుస్తున్న ట్రినిడాడ్ పిచ్ కూడా ఆ కోవలోకే వస్తుంది. 

అలాంటి ఫ్లాట్ పిచ్ పై నిప్పులు చెరిగే బౌలింగ్ చేసిన హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ విండీస్ లోయరార్డర్ ను హడలెత్తించాడు. తన ప్రదర్శనపై సిరాజ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. 

నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం సిరాజ్ మాట్లాడుతూ, ఫ్లాట్ గా ఉన్న పిచ్ పై 5 వికెట్లు తీయడం చాలా కష్టం అని, అయితే, తాను ఫిట్ గా ఉండడంతో మరింత మెరుగ్గా బౌలింగ్ చేయగలిగానని వివరించాడు. 

తాను ఇంత ఫిట్ గా ఉండడానికి కారణం ఫిట్ నెస్ ట్రైనరల్ సోహెమ్ దేశాయ్ అని తెలిపాడు. తాను మ్యాచ్ కు తగిన విధంగా ఫిట్ గా ఉండేలా చూసుకునే బాధ్యత దేశాయ్ దేనని సిరాజ్ పేర్కొన్నాడు. తాను విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయడం వెనుక అతడి శ్రమ కూడా ఉందని తెలిపాడు. 

బౌలర్లకు సహకరించని పిచ్ లపై బౌలింగ్ చేయడాన్ని తాను సవాల్ గా భావిస్తానని, విండీస్ పై వికెట్ టు వికెట్ బౌలింగ్ చేశానని, అది సత్ఫలితాలను ఇచ్చిందని సిరాజ్ వెల్లడించాడు.
Mohammed Siraj
Team India
Flat Pitch
Trinidad
West Indies
2nd Test

More Telugu News