Rahul Gandhi: ఎలా కావాలనుకుంటే అలా పిలుచుకోండి మిస్టర్ మోదీ... కానీ మేం 'ఇండియా'నే: రాహుల్ గాంధీ
- I.N.D.I.A పేరిట విపక్షాల కూటమి
- ఈస్ట్ ఇండియా కంపెనీ పేరులోనూ ఇండియా ఉందన్న మోదీ
- మణిపూర్ లో భారతీయతను పునర్ నిర్మిస్తామన్న రాహుల్
కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పదుల సంఖ్యలో పార్టీలు జట్టు కట్టిన సంగతి తెలిసిందే. I.N.D.I.A (ఇండియా) పేరిట కూటమిగా ఏర్పడిన ఈ పార్టీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. భారత గడ్డపై పాలన సాగించిన ఈస్ట్ ఇండియా కంపెనీలోనూ 'ఇండియా' ఉందని తాజాగా ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బదులిచ్చారు.
"మిస్టర్ మోదీ... మీకు ఎలా కావాలనుకుంటే అలా పిలుచుకోండి... కానీ మేం ఇండియానే. గాయపడిన మణిపూర్ కోలుకునేందుకు మేం సహాయం చేస్తాం. ప్రతి మహిళ, ప్రతి చిన్నారి కన్నీళ్లను తుడుస్తాం. మణిపూర్ ప్రజల ప్రేమను, ప్రశాంతతను తిరిగి తీసుకువస్తాం. మణిపూర్ లో భారతీయతను పునర్ నిర్మిస్తాం" అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.