Pawan Kalyan: మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఐదుగురు కార్మికుల మృతి... పవన్ కల్యాణ్ స్పందన
- సూర్యాపేట జిల్లాలో ఘటన
- మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో కూలిన లిఫ్టు
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
- బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు వద్ద ఉన్న మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఇవాళ విషాద ఘటన చోటుచేసుకుంది. కాంక్రీట్ పనులు జరుగుతున్న సమయంలో లిఫ్ట్ కూలిపోవడంతో ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దుర్ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. మై హోమ్ సంస్థకు చెందిన సిమెంట్ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు వలస కార్మికులు మృతి చెందడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ పనులు జరుగుతుండగా లిఫ్ట్ కూలిపోయి, ఈ ప్రమాదం జరిగినట్టు మీడియా ద్వారా తెలిసిందని వెల్లడించారు.
బాధిత కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయబద్ధమైన ఆర్థిక పరిహారాన్ని అందించాలని పవన్ కల్యాణ్ సూచించారు. కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలను పాటించడం, ఆ ప్రమాణాలను సంబంధిత శాఖలు పర్యవేక్షిస్తుండాలన్న అవసరాన్ని ఈ ఘటన చాటిచెబుతోందని పేర్కొన్నారు. పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వస్తున్న కార్మికుల జీవితాలకు ప్రభుత్వాలు, కర్మాగారాల యాజమాన్యాలు భరోసా కల్పించాలని సలహా ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి కోసం వలస వస్తున్న కార్మికుల సంఖ్య ఎక్కువగానే ఉంటోందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వలస వస్తున్న కార్మికుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసే బాధ్యతను రాష్ట్ర కార్మిక శాఖ తీసుకోవాలని పవన్ కల్యాణ్ కోరారు.