New Delhi: కేజ్రీవాల్ ప్రభుత్వానికి షాక్.. ఆర్డినెన్స్ స్థానంలో బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- అధికారుల పోస్టింగ్‌పై నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అప్పగిస్తూ ఆర్డినెన్స్
- త్వరలో పార్లమెంట్‌కు బిల్లు
- సభలో బిల్లును అడ్డుకోవాలని విపక్షాలకు ఆమ్ ఆద్మీ పార్టీ విజ్ఞప్తి
ఢిల్లీలో అధికారుల పోస్టింగ్ పై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్ కు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌ను బిల్లుగా మారుస్తూ కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపినట్లుగా వార్తలు వచ్చాయి. త్వరలో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు. ఢిల్లీలో పరిపాలన సేవలపై నియంత్రణను ఢిల్లీ ప్రభుత్వం నుండి కేంద్రం తీసుకుంటోంది.
అక్కడి గ్రూప్ ఏ అధికారుల బదలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు గాను కేంద్రం మే నెలలో ఆర్డినెన్స్ తీసుకురాగా, కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పును అమలు చేయాలని కేజ్రీవాల్, ఆయన పార్టీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఆర్డినెన్స్ తీసుకు వచ్చిన కేంద్రం ఇప్పుడు దాని స్థానంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టనుంది. దీనిని సభలో అడ్డుకోవడానికి సహకరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ విపక్షాలను కోరుతోంది.