Manipur violence: రాజీనామా చేసే సమస్యే లేదన్న మణిపూర్ సీఎం

No question of me resigning says Chief Minister Biren Singh on Manipur violence

  • అధిష్ఠానం ఆదేశిస్తే తప్పుకుంటానని బీరేన్ సింగ్ వివరణ
  • మణిపూర్ అల్లర్లకు అక్రమ వలసదారులే కారణమని ఆరోపణ
  • రాష్ట్రంలో శాంతి నెలకొల్పడంపైనే దృష్టి పెట్టామని వెల్లడి

మణిపూర్ లో అల్లర్లు, మహిళల నగ్న ఊరేగింపు ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని సీఎం బీరేన్ సింగ్ కొట్టిపారేశారు. తాను రాజీనామా చేసే సమస్యే లేదని తేల్చిచెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ కార్యకర్తనని, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రినని అన్నారు. పార్టీ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించే విధేయతగల కార్యకర్తనని వివరించారు. అధిష్ఠానం ఆదేశిస్తే పదవి నుంచి తప్పుకుంటానని వివరించారు. మణిపూర్ లో హింసకు, అల్లర్లకు కారణం అక్రమంగా వలస వచ్చిన వారేనని ఆరోపించారు.

రాష్ట్రంలో మైతేయిలు, కుకీలతో పాటు 34 తెగల ప్రజలు ఐకమత్యంగా నివసిస్తున్నారని చెప్పారు. మే 3న నిర్వహించిన గిరిజన తెగల ర్యాలీ వల్లే రాష్ట్రంలో హింస చెలరేగిందని, డ్రగ్ స్మగ్లర్లు కూడా ఈ అల్లర్లకు కారణమని చెప్పారు. ప్రస్తుతం తన దృష్టి అంతా రాష్ట్రంలో శాంతి నెలకొల్పడంపైనే ఉందని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం, ఆర్మీ బలగాలు రాష్ట్రంలో శాంతి స్థాపనకు కృషి చేస్తున్నాయని వివరించారు. త్వరలోనే రాష్ట్రంలో సాధారణ పరిస్థితి నెలకొంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News