swiggy: కస్టమర్లకు సరికొత్త క్రెడిట్ కార్డ్‌ను లాంచ్ చేసిన స్విగ్గీ... 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో కలిసి కో-బ్రాండెడ్ కార్డును తెచ్చిన స్విగ్గీ
- స్విగ్గీ ఫుడ్, గ్రాసరీ డెలివరీపై అదిరిపోయే క్యాష్ బ్యాక్
- అమెజాన్ సహా వివిధ ప్లాట్ ఫామ్స్‌పై 5 శాతం క్యాష్ బ్యాక్
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ, ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కలిసి స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును తీసుకు వచ్చాయి. మాస్టర్ కార్డు పేమెంట్ నెట్ వర్క్‌పై ఈ కార్డు పని చేస్తుంది. ఈ కార్డు ద్వారా స్విగ్గీ ఫుడ్, గ్రాసరీ డెలివరీపై పది శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇతర కొనుగోళ్లపై కూడా రివార్డులు, ప్రయోజనాలు ఉంటాయి. స్విగ్గీ నుండి ఇలాంటి క్రెడిట్ కార్డు రావడం ఇదే మొదటిసారి.
ఈ క్రెడిట్ కార్డు ద్వారా స్విగ్గీలో ఫుడ్, గ్రాసరీ ఆర్డర్ చేస్తే పది శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే అమెజాన్, అడిడాస్, ఓలా, ఫార్మ్ ఈజీ, నెట్ మెడ్స్, ఫ్లిప్ కార్ట్, నైక్, ఉబెర్, బుక్ మై షో సహా వెయ్యికి పైగా భాగస్వామ్య ప్లాట్ ఫామ్‌లలో 5 శాతం క్యాష్ బ్యాక్ ఉంటుందని బెంగళూరు ప్రధాన కార్యాలయంగా కలిగిన స్విగ్గీ వెల్లడించింది. ఇతర కొనుగోళ్లపై 1 శాతం క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ మొత్తం స్విగ్గీ మనీలో జమ అవుతుంది.