Nara Lokesh: వైసీపీ దోపిడీదార్లతో టీడీపీ యుద్ధం: నారా లోకేశ్
- ఒంగోలులో హోరెత్తిన యువగళం పాదయాత్ర
- దారిపొడవునా జననీరాజనం, వినతుల వెల్లువ
- లోకేశ్‌ను కలిసిన న్యాయవాదులు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు
- టీడీపీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలూ పరిష్కరిస్తామని యువనేత హామీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఒంగోలులో చేపట్టిన యువగళం 166వ రోజు పాదయాత్ర హోరెత్తిచ్చింది. ఒంగోలు శివారు పాలకేంద్రం వద్ద నుంచి ప్రారంభమైన పాదయాత్రలో ప్రజలు జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యువతనేత వెంట నడిచారు.
ఒంగోలు బహిరంగసభలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో ఏపీ గుంతల రాజ్యంగా మారిందని విమర్శించారు. వైసీపీ దోపిడీదార్లతో టీడీపీ పేదల పక్షాన యుద్ధం చేస్తోందని వ్యాఖ్యానించారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీ అని చెప్పారు. టీడీపీ స్థాయిలో జగన్ ఇళ్లు కట్టాలంటే వంద జన్మలెత్తాలని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. జిల్లాకు ఎవరేం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రెడ్ బుక్‌లో టీడీపీ కార్యకర్తలను వేధించిన వారి పేర్లు రాస్తున్నట్టు చెప్పారు. వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేసులు ఎక్కువ ఉన్న వారే పార్టీ కోసం పోరాడినట్టని అన్నారు. వారికి అధికారంలోకి వచ్చాక మెరుగైన నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.
యువనేత లోకేశ్‌ను కలిసిన విరాట్ నగర్ ప్రజలు
ఒంగోలు విరాట్ నగర్ ప్రజలు యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యల గురించి వివరించారు.
నారా లోకేశ్ మాట్లాడుతూ..
‘‘జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పన్నుల బాదుడుపై ఉన్న శ్రద్ధ ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వడంపై లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో ఒంగోలు నగరంలో నీటి కొరత తీర్చే నూతన తాగునీటి పథకానికి రూ.173కోట్లు మంజూరు చేస్తే, సైకో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు నిలిపివేసింది. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పథకాన్ని పూర్తిచేసి ఇంటింటికీ తాగునీటి కుళాయి అందిస్తాం. నగరంలో రోడ్లు, డ్రైనేజీ ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం’’ అని అన్నారు.
నారా లోకేశ్‌ను కలిసిన న్యాయవాదులు
ఒంగోలు కోర్టు సెంటర్లో న్యాయవాదులు యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. న్యాయవాదులకు అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని కోరారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10వేలు స్టైఫండ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అడ్వొకేట్స్ కు రీజనబుల్ మార్కెట్ విలువతో కూడిన ఇళ్ల స్థలాలు ఇప్పించాలని విన్నవించారు. ఒంగోలు నుండి అమరావతి హైకోర్టుకు నేరుగా వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
నారా లోకేశ్ స్పందిస్తూ...
జగన్మోహన్ రెడ్డి పాలనలో హైకోర్టు న్యాయమూర్తులకే రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన న్యాయమూర్తులపై వైసీపీ మూకలు సోషల్ మీడియా వేదికపై దాడికి దిగాయని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక న్యాయవాదులు, న్యాయమూర్తుల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులకు ఇళ్లస్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులు యువనేత నారా లోకేశ్‌ను కలిశారు. ఆర్యవైశ్యులు, విశ్వబ్రాహ్మణులు, ముస్లిం మైనారిటీలు, బ్రాహ్మణ సామాజికవర్గ ప్రజలు తమ సమస్యలను వివరిస్తూ యువనేతకు వినపత్రాలు అందించారు. తమ సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థించారు. వారి అభ్యర్థనలపై సానుకూలంగా స్పందించిన యువనేత టీడీపీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలూ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వివరాలు
- ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2197.1 కి.మీ
- ఈరోజు నడిచిన దూరం 8.0 కి.మీ
167వరోజు (27-7-2023) యువగళం వివరాలు
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం (ప్రకాశం జిల్లా)
సాయంత్రం
4.00 – ఒంగోలు రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట క్యాంప్ సైట్ జయహో బీసీ సదస్సు.
7.00 – రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట విడిది కేంద్రంలో బస