Sanjay Rao: పెళ్లిచుట్టూ తిరిగే ఫ్యామిలీ ఎంటర్టయినర్ .. 'స్లమ్ డాగ్ హస్బెండ్'
- హాస్య ప్రధానంగా సాగే 'స్లమ్ డాగ్ హస్బెండ్'
- బ్రహ్మాజీ తనయుడి రెండో సినిమా ఇది
- ఈ రోజు సాయంత్రం జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్
- ముఖ్య అతిథిగా రానున్న శ్రీలీల
- ఈ నెల 29వ తేదీన సినిమా విడుదల
బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు ' ఓ పిట్టకథ' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా అంతా కూడా ప్రేమ చుట్టూ తిరుగుతుంది. అందుకు భిన్నంగా ఈ సారి ఆయన పెళ్లి చుట్టూ తిరిగే కథను ఎంచుకున్నాడు. ఆ సినిమా పేరే 'స్లమ్ డాగ్ హస్బెండ్'. అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకి ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించగా, భీమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు.
పెళ్లికి సంబంధించినంత వరకూ జాతకాలలో ఏదైనా దోషం ఉంటే, అరటి చెట్టుతో గానీ .. ఏదైనా జంతువుతో గాని మొదటి పెళ్లిగా భావించి అందుకు సంబంధించిన పెళ్లి తంతు జరిపిస్తుంటారు. అలా ఈ కథలో హీరో తన జాతక దోషం పరిహారంలో భాగంగా కుక్కను పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత అసలు పెళ్లి చేసుకోవాలనుకున్న ఆయనకి, కుక్కతో జరిగిన పెళ్లి అడ్డుపడుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? అనేది కథ.
కామెడీని ప్రధానంగా చేసుకుని సాగే వినోదభరితమైన సినిమా ఇది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించిన సాంగ్ కూడా కనెక్ట్ అయింది. శ్రీలీల చీఫ్ గెస్టుగా ఈ రోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ప్రణవి ముకుంద హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాను, ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నారు.