marriage: పెళ్లిళ్లలో సినిమా పాటలు వేయడం కాపీరైట్ కిందకు రాదు: కేంద్రం స్పష్టీకరణ
- కాపీరైట్ సొసైటీలు రాయల్టీని వసూలు చేస్తున్నాయనే ఫిర్యాదులపై స్పందించిన కేంద్రం
- కాపీ రైట్ యాక్ట్ 1957లోని సెక్షన్ 52(1)కు విరుద్ధమని స్పష్టీకరణ
- వివాహ ఊరేగింపుతో పాటు పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు మతపరమైన వేడుకలేనని వ్యాఖ్య
పెళ్లి, ఇతర వేడుకల్లో బాలీవుడ్ పాటలను ప్లే చేయడం కాపీరైట్ ఉల్లంఘన కిందకురాదని, ఇందుకు గాను చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఏమీ ఉండదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివాహ, శుభకార్యాలలో హిందీ సినిమా పాటల ప్రదర్శన కోసం కాపీరైట్ సొసైటీలు రాయల్టీని వసూలు చేయడంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్, ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) ఓ ప్రకటనను విడుదల చేసింది.
వివాహాది శుభకార్యాలలో సినిమా పాటల వినియోగం, ప్రదర్శన కోసం ఆయా భాగస్వామ్య పక్షాలు రాయాల్టీని వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు అందాయని, ఇది కాపీ రైట్ యాక్ట్ 1957లోని సెక్షన్ 52(1)కు విరుద్ధమని, మతపరమైన కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో ప్రదర్శించే నాటక, సాహిత్య, మ్యూజిక్ లేదా ఏదైనా సౌండ్ రికార్డింగ్ లు కాపీరైట్ ఉల్లంఘన కిందకు రావని సెక్షన్ 52(1) (za) చెబుతోందని వెల్లడించింది. వివాహ ఊరేగింపుతో పాటు పెళ్లికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా మతపరమైన వేడుకల కిందకే వస్తాయని తెలిపింది. దీనిని దృష్టిలో పెట్టుకొని కాపీరైట్ సంస్థలు వసూళ్లకు దూరంగా ఉండాలని సూచించింది.