Chandrababu: ఇరిగేషన్ మంత్రి ఆంబోతులా అరుస్తాడు... జగన్ ప్రజాద్రోహి: ఏపీలో ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్

Chandrababu power point presentation on projects in AP

  • టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ప్రెస్ మీట్
  • కాలువల నిర్వహణ కూడా చేయలేని ప్రభుత్వం అంటూ విమర్శలు
  • వీళ్లా ప్రాజెక్టులు కట్టేది అంటూ ఎద్దేవా
  • అన్నీ ఉత్తుత్తి సమీక్షలు చేస్తుంటారని వ్యాఖ్యలు
  • ముఖ్యమంత్రికి తీరిక ఉండదని ఆగ్రహం
  • ప్రాజెక్టుల వారీగా వివరాలు వెల్లడించిన టీడీపీ అధినేత

రాష్ట్రంలో ప్రాజెక్టులు పడకేసిన పరిస్థితులకు కారణం సీఎం జగన్ అని, జగన్ ప్రజాద్రోహి అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.  కోస్తాంధ్రలో టీడీపీ హయాంలో ప్రాజెక్టులపై రూ.21,442 కోట్లు ఖర్చు చేస్తే, నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.4,375 కోట్లే అని, ఇలాగేతై ప్రాజెక్టులు ఎలా పూర్తి అవుతాయని ప్రశ్నించారు. కాలువల నిర్వహణ కూడా చేయలేని ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుందా? అంటూ చంద్రబాబు నిలదీశారు. 

నిన్న రాయలసీమ సాగునీటి ప్రాజెక్ట్ లపై మాట్లాడితే, చీఫ్ సెక్రటరీ హడావిడిగా సమీక్ష చేశాడు... ముఖ్యమంత్రికి తీరికలేదు... ఇరిగేషన్ మంత్రి ఆంబోతులా అరుస్తాడు తప్ప ఏమీ తెలియదని చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు కోస్తాంధ్రలోని జల ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 

ఇవిగో కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల వివరాలు: చంద్రబాబు

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి

మొత్తం ఆయకట్టు 8 లక్షల ఎకరాలు, 30 లక్షల మందికి తాగునీరు అందించేలా టీడీపీ హయాంలో రూ.13 కోట్లు ఖర్చుపెట్టాం. వైసీపీ రూ.780కోట్లు కేటాయించినట్టు పేపర్లపై చూపించి, అరకొరగా రూ.5 కోట్లు ఖర్చుపెట్టారు. అతి ముఖ్యమైన ఈ ప్రాజెక్ట్ ని ఇలా చేసినందుకు సిగ్గుగాలేదా? 

వంశధార ఫేజ్- 2

ప్రాజెక్ట్ ఫేజ్-1 పూర్తయింది. మొత్తం ప్రాజెక్ట్ పరిధిలోని ఆయకట్టు 2,55,510 ఎకరాలు. టీడీపీ ప్రభుత్వం రూ.871 కోట్లు ఖర్చుపెడితే,  ఈ ప్రభుత్వం రూ.352 కోట్లు ఖర్చుపెట్టింది.  

ప్రస్తుతం ప్రాజెక్ట్ నిర్మాణ పరిస్థితి ఎలా ఉందంటే... గడువు పెంచడం, తేదీలు మార్చడం చేస్తున్నారు. 2021 ఆగస్ట్, 2022 ఆగస్ట్, 2023 జూలై ఇప్పటికీ ఇలా మూడు తేదీలు మార్చారు. ఫలితం ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం.

సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ నిర్మాణం

మొత్తం ఆయకట్టు 2,10,000 ఎకరాలు. టీడీపీ ప్రభుత్వం రూ.236 కోట్లు ఖర్చుపెట్టి  ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసింది. 2003లో టీడీపీ ప్రభుత్వమే శంకుస్థాపన చేసింది. తిరిగి 2015లో నేనే ప్రాజెక్ట్ ప్రారంభించాను. 

అక్కడక్కడ మిగిలిపోయిన కొద్దిపాటి పనుల్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. రూ.56 కోట్ల ప్రజలసొమ్ముని నీళ్లపాలు చేసింది. తోటపల్లి బ్యారేజీలో మిగిలిన అరకొర పనులు పూర్తిచేయలేని అక్కడి మంత్రి ఏదేదో మాట్లాడుతుంటాడు.

మహేంద్ర తనయ ఆఫ్ షోర్

మొత్తం ఆయకట్టు 25,000 ఎకరాలు. టీడీపీ ప్రభుత్వం రూ.553 కోట్లు ఖర్చు పెడితే, వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం రూ.9 కోట్లు. ఐదేళ్లు అవుతోంది కానీ ప్రాజెక్ట్ లో 5 శాతం పనిజరగలేదు.

రైవాడ రిజర్వాయర్

మొత్తం ఆయకట్టు 21,344 ఎకరాలు. టీడీపీ రూ.30 కోట్లు ఖర్చు పెడితే, వైసీపీ రూ.4 కోట్లు ఖర్చు పెట్టింది. నాలుగేళ్లలో ఎక్కడా అంగుళం పని జరగలేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపేయడంతో, పనులు ఆపేసి వెళ్లిపోయారు. కాలువలు బాగుచేయకపోవడంతో, చివరి ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి నెలకొంది.

తారకరామతీర్థ సాగర్

ఉమ్మడి రాష్ట్రంలో నేనే ప్రారంభించాను. మొత్తం ఆయకట్టు 24,000ఎకరాలు. టీడీపీ ప్రభుత్వం రూ.103 కోట్లు ఖర్చు పెట్టింది. వైసీపీ రూ.56 కోట్లు పెట్టినా పనులన్నీ నత్తనడకనే సాగుతున్నాయి. భూసేకరణ జాప్యం చేశారు. కాలువల ఆధునికీకరణకు నిధులివ్వలేదు. రిజర్వాయర్లో పెరిగిన పిచ్చిచెట్లను తొలగించలేకపోయారు.

హీరమండల రిజర్వాయర్

మొత్తం ఆయకట్టు 10,000ఎకరాలు. టీడీపీ ప్రభుత్వంలో 74 శాతం పనులు పూర్తిచేశాం. నాలుగేళ్లుగా వైసీపీ తేదీలు మార్చుతోంది తప్ప, ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పలేని దుస్థితికి తీసుకువచ్చారు. 

పురుషోత్తమ పట్నం పోలవరం ఎడమకాలువ

మొత్తం ఆయకట్టు 2.15లక్షల ఎకరాలు. టీడీపీ హయాంలో రూ.1,578 కోట్లు ఖర్చుపెట్టాం. 17 టీఎంసీల నీటిని ఏలేరు రిజర్వాయర్ కు తరలించాం. వైసీపీ ప్రభుత్వం రూ.126 కోట్లు ఖర్చు పెట్టి, ప్రాజెక్ట్ ను ట్రైబ్యునల్ ముందు నిలిపింది. 

తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రాజెక్ట్ లను ట్రైబ్యునళ్ల ముందు నిలిపి, ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ప్రాజెక్ట్ ల వివాదాల్ని పరిష్కరించడం లేదు గానీ, తన సొంతకేసులు వాదించుకోవడానికి మాత్రం జగన్ వేలకోట్ల ప్రజల సొమ్ము తగలేస్తున్నాడు.

పట్టిసీమ ఎత్తిపోతల

13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాం. 120 టీఎంసీల నీరు శ్రీశైలంలో నిల్వచేసి, ఆ నీటిని రాయలసీమకు తరలించాము. పులివెందులకు కూడా నీళ్లిచ్చాం. పట్టీసీమ నీటితో సీమలో నేడు సిరులు పండుతున్నాయి. దీని నిర్మాణానికి రూ.1600 కోట్లు ఖర్చుపెట్టాం. 263 టీఎంసీల నీటిని పొలాలకు తరలించి, 40వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులు సాధించాం.

తాడిపూడి

మొత్తం ఆయకట్టు 2.15లక్షల ఎకరాలు. టీడీపీ రూ.96 కోట్ల ఖర్చు పెడితే, వైసీపీ రూ.27 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రస్తుతం పనులన్నీ నిలిపేసి, తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి తీరని అన్యాయం చేశారు. ఎన్.జీ.టీలోని వివాదాల్ని పరిష్కరించలేకపోయారు.

పుష్కర లిఫ్ట్

మొత్తం ఆయకట్టు 1,85,000ఎకరాలు. టీడీపీ హయాంలో రూ.140 కోట్లు ఖర్చు పెట్టాం. వైసీపీ రూ.54 కోట్లు ఖర్చు పెట్టి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా పనులు ఆపేసింది. 163 గ్రామాలకు తాగునీరు అందించే ప్రాజెక్ట్ ను ప్రశ్నార్థకంగా మార్చింది.

చింతలపూడి లిఫ్ట్

మొత్తం ఆయకట్టు 1,75,000 ఎకరాలు. టీడీపీ హయాంలో రూ.2,289 కోట్లు ఖర్చు పెట్టాం. వైసీపీ రూ.650 కోట్లు వెచ్చించి, నిధులు లేవని భూసేకరణ నిలిపేసింది. కృష్ణా-పశ్చిమగోదావరి రైతులకు లబ్ది కలిగించే లిఫ్ట్ ను గాలికి వదిలేసింది. 

నాగార్జున సాగర్ ఎడమకాలువ తెలంగాణ నుంచి నల్గొండ, ఖమ్మం, కృష్ణా, నందిగా, మైలవరం, తిరువూరుకు వెళుతుంది. 30 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉండగా... ఒక్కసారి కూడా రాలేదు. ఆ ఇబ్బందులు అధిగమించడానికే చింతలపూడి లిఫ్ట్ ఏర్పాటు చేశాం.

పులిచింతల ప్రాజెక్ట్

మొత్తం ఆయకట్టు 13 లక్షల ఎకరాలు. టీడీపీ ప్రభుత్వంలో రూ.1,174 కోట్లు ఖర్చు పెట్టాం. వైసీపీ రూ.40 కోట్లు పెట్టి గేట్లు కొట్టుకుపోయేలా చేసింది. ప్రాజెక్ట్ గేట్లకు గ్రీజు కూడా రాయలేని ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వమేనా?

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్

మొత్తం ఆయకట్టు 4.60లక్షల ఎకరాలు. దీన్ని నేనే ప్రారంభించాను. టీడీపీ ప్రభుత్వం రూ.1,414కోట్లు ఖర్చు పెట్టింది. మేం వచ్చేనాటికి ప్రాజెక్ట్ మొత్తం అస్తవ్యస్తంగా ఉంది, కాంట్రాక్టర్లు మొండికేశారు. వారిని దారిలోపెట్టి, ఒక టన్నెల్ పూర్తిచేశాం. నీళ్లిచ్చే సమయానికి ఈ ప్రభుత్వం వచ్చి, పనులన్నీ ఆపేసింది. 

కేంద్ర గెజిట్ లో వెలిగొండ ప్రాజెక్ట్ లేకపోతే, ఈ ప్రభుత్వం నోరెత్తలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలు ఢిల్లీకి వెళ్లి పోరాడారు.

వెలిగొండ టన్నెల్లో తవ్విన మట్టిని శ్రీశైలం కొండల్లో పోస్తున్నారు. దానివల్ల ప్రాజెక్ట్ లో సిల్ట్ పెరిగి జరిగే నష్టమే ఎక్కువ. దయచేసి ఇలాంటి పనులు చేయవద్దని చెబుతున్నా.

గుండ్లకమ్మ రిజర్వాయర్

మొత్తం ఆయకట్టు 80 వేల ఎకరాలు. టీడీపీ హాయాంలో రూ.81 కోట్లు ఖర్చు పెట్టాం. వైసీపీ రూ.22 కోట్లు ఖర్చు పెట్టి, నిర్వహణను పట్టించుకోకపోవడంతో గేట్లు కొట్టుకుపోయాయి. అడ్డగోలుగా ఇసుక తవ్వేయడంతో మొత్తం ప్రాజెక్టే ప్రమాదంలో పడే పరిస్థితి.

సంగం బ్యారేజ్

మొత్తం ఆయకట్టు 3లక్షల ఎకరాలు. టీడీపీ హయాంలో రూ.88 కోట్లు ఖర్చు పెట్టాం. ప్రాజెక్ట్ ను 80 శాతం పూర్తి చేశాం. వైసీపీ వచ్చాక రూ.116 కోట్లు ఖర్చు పెట్టి, మిగిలిన పనులు నాలుగేళ్లలో పూర్తిచేసింది. నిర్మాణానికి పెట్టిన ఖర్చు కంటే ప్రచారానికే ఎక్కువ పెట్టారు.

నెల్లూరు బ్యారేజ్

మొత్తం ఆయకట్టు 2 లక్షల ఎకరాలు. టీడీపీ హయాంలో రూ.80 కోట్లు ఖర్చు చేసి, 90 శాతం పనులు పూర్తి చేశాం. వైసీపీ మిగిలిన పది శాతం పనులు చేయడానికి రూ.67 కోట్లు ఖర్చు పెట్టింది.

కృష్ణా డెల్టా ఆధునికీకరణ

టీడీపీ హయాంలో రూ.1,239 కోట్లు  ఖర్చు పెట్టాం. వైసీపీ వచ్చాక రూ.204 కోట్లు ఖర్చు పెట్టింది. ఆధునికీకరణ పనులు ఆపేయడంతో,  ఇప్పటికీ లక్షల ఎకరాల్లో నీటి ఎద్దడే. ఇదీ పరిస్థితి. ప్రాజెక్టుల్లో గుర్రపుడెక్క తీయడం లేదు. ఇరిగేషన్ మంత్రి సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో రైతులే చందాలు వేసుకొని కాలువలు బాగుచేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థంచేసుకోండి.

గోదావరి డెల్టా ఆధునికీకరణ

టీడీపీ ప్రభుత్వం రూ.81 3కోట్లు ఖర్చుపెడితే, వైసీపీ రూ.123 కోట్లు వెచ్చించింది. గేట్లు సరిగా లేవు. అన్నీ లీకవుతున్నాయి. కొన్ని గేట్లు తుప్పుపట్టాయి. డ్రెయిన్ల నిర్వహణ పట్టించుకోకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు.

గోదావరి కృష్ణా పెన్నా ఫ్లడ్ నియంత్రణ

దీనికి టీడీపీ రూ.701 కోట్లు ఖర్చుపెట్టింది. వైసీపీ వచ్చాక రూ.80 కోట్లు పెట్టింది. వరద నీటి నియంత్రణకు చర్యలు తీసుకోకుండా గాలికి వదిలేశారు. కాలువ గట్లను బలోపేతం చేయకపోవడంతో పంటపొలాలు నీళ్లపాలవుతున్నాయి. పోలవరం ప్రధాన కుడికాలువలో మట్టిని గట్లకు వేయాల్సిన ఈ దొంగలు, దాన్ని అమ్ముకున్నారు. దాని వల్ల నీళ్లు పొలాల్లోకి, గ్రామాల్లోకి వెళ్లే దుస్థితి తలెత్తింది. ఇదీ ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్టుల నిర్వహణ.

గోదావరి పెన్నా నదుల అనుసంధానం

ఈ ప్రాజెక్ట్ లో భాగంగా గోదావరి నీటిని వైకుంఠపురం వద్దకు తీసుకెళ్లి, అక్కడి నుంచి పల్నాడుజిల్లా నకరికల్లులోని నాగార్జునసాగర్ ప్రధాన కుడికాలువకు నీటిని తరలించ డానికి మా ప్రభుత్వంలో టెండర్లు పిలిచాం. 

ఇది పూర్తయితే సముద్రం పాలయ్యే 130 టీఎంసీల గోదావరి నీరు పెన్నానదికి, ఈ నీటికి... చింతలపూడి నుంచి వచ్చే మరో 30 టీఎంసీలు, శ్రీశైలం నుంచి మరో 130 టీఎంసీలు, పట్టిసీమ నంచి మరో 120 టీఎంసీలు కలిపి రాయలసీమకు తరలించవచ్చు. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్ ను కూడా నాశనం చేశారు.

ఎవరి హాయాంలో ఏ ప్రాజెక్ట్ నిర్మాణం ఎంతెంత పూర్తయిందంటే...

వంశధార ఫేజ్ -2: 
టీడీపీ హాయాంలో 79 శాతం పనులు జరిగితే, వైసీపీ హయాంలో కేవలం 10 శాతం పనులు జరిగాయి.
తోటపల్లి బ్యారేజ్:
టీడీపీ హయాంలో 80 శాతం పనుల చేస్తే, వైసీపీ కేవలం 3 శాతం పనులు చేసింది.
పుష్కర లిఫ్ట్:
టీడీపీ 97 శాతం పూర్తి చేసింది. వైసీపీ నాలుగేళ్లలో 1 శాతం చేసింది
తాటిపూడి లిఫ్ట్: 
టీడీపీ హయాంలో 68 శాతం చేశాం. వైసీపీ వాళ్లు 20 శాతం చేశారు.
మద్దువలస స్టేజ్ -2: 
టీడీపీ 72.6 శాతం పూర్తిచేస్తే, వైసీపీ కేవలం 6 శాతం చేసింది.
నెల్లూరు బ్యారేజ్ : 
టీడీపీ హయాంలో 74 శాతం పూర్తయితే, వైసీపీ వాళ్లు 23 శాతం చేశారు.
పెన్నాడెల్టా ఆధునికీకరణ: 
టీడీపీ 89 శాతం పూర్తి చేస్తే, వైసీపీ కేవలం 2 శాతం పనులు చేసింది.
నాగావళి ఫ్లడ్ :
టీడీపీ హయాంలో 46 శాతం పూర్తయితే, వైసీపీ 10 శాతం చేసింది.

1. చిన్నసానఎత్తిపోతల పథకం -  శ్రీకాకుళం జిల్లా
2. తోటపల్లి రిజర్వాయర్   - విజయనగరం జిల్లా
3. శారదానది ఆనకట్ట – విశాఖపట్నం
4. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల – తూర్పుగోదావరి
5. పట్టిసీమ -  పశ్చిమగోదావరి
6. పోగొండ రిజర్వాయర్ – పశ్చిమగోదావరి
7. ఎర్రకాలువ ఆధునికీకరణ – పశ్చిమగోదావరి
8. కొండవీటి వాగు – గుంటూరు జిల్లా
9. పెదపాలెం ఎత్తిపోతల పథకం – గుంటూరు జిల్లా
10. కే.ఎల్.రావు పులిచింతల ప్రాజెక్ట్ – గుంటూరు
11. గుండ్లకమ్మ కొరిశపాడు ప్రాజెక్ట్ – ప్రకాశం జిల్లా
12. కండలేరు ఎడమకాలువ – నెల్లూరుజిల్లా 

వీటితో పాటు మొత్తం 23 ప్రాజెక్టులు పూర్తిచేశాం. వైసీపీ హయాంలో కొత్తగా ఒక్కప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టలేదు. ఒక్క ప్రాజెక్ట్ పూర్తిచేయలే దు. అదనంగా నాలుగేళ్లలో ఒక్కఎకరాకు నీరివ్వలేదు. అసమర్థుడు ముఖ్యమంత్రి అయితే ప్రాజెక్టులు అయినా, ప్రజలైనా ఇదే పరిస్థితి... అంటూ  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన సుదీర్ఘ పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో విడమర్చారు.

  • Loading...

More Telugu News