Anchor Udayabhanu: ఐదేళ్ల తర్వాత పబ్లిక్ లోకి... లోకేశ్ సభలో ప్రత్యక్షమైన యాంకర్ ఉదయభాను

Anchor Udayabhanu host Nara Lokesh Jayaho BC in Ongole
  • ఒంగోలు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • ఒంగోలులో జయహో బీసీ కార్యక్రమం
  • వ్యాఖ్యాతగా విచ్చేసిన ఉదయభాను
  • నన్ను మీరింకా మర్చిపోలేదు అంటూ వ్యాఖ్యలు
  • తనకు ప్రతి కన్నీటి చుక్క విలువ తెలుసంటూ ఉద్వేగపూరిత ప్రసంగం
ప్రముఖ యాంకర్, నటి ఉదయభాను పెళ్లి చేసుకుని, పిల్లలతో సంసార జీవితంలో సెటిలైన సంగతి తెలిసిందే. యాంకర్లకు స్టార్ డమ్ వచ్చిందంటే అది ఉదయభానుతోనే ప్రారంభమైందని చెప్పాలి. ఒకప్పుడు తన మాటల ప్రవాహంతో ఆడియన్స్ ను విశేషంగా అలరించిన ఉదయభాను గత ఐదేళ్లుగా పబ్లిక్ లోకి వచ్చింది లేదు. 

అయితే, ఎవరూ ఊహించని విధంగా ఉదయభాను ఒంగోలులో నిర్వహించిన నారా లోకేశ్ సభలో ప్రత్యక్షమయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతోంది. ఈ సందర్భంగా నేటి సాయంత్రం జయహో బీసీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. లోకేశ్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఉదయభాను వ్యాఖ్యాతగా, సంధానకర్తగా వ్యవహరించారు. 

ఎప్పట్లాగానే ఉదయభాను తన జోష్ తో సభికులను ఆకట్టుకున్నారు. అంతేకాదు, తనలో సామాజిక స్పృహ కూడా ఉందని కొన్ని దృష్టాంతాల ద్వారా చాటుకున్నారు. గంగ గరుడాలెత్తుకెళ్లేరా... ఇంక ఆంబోతుల ఆట సాగేరా అంటూ ఓ గీతాన్ని కూడా ఉదయభాను ఆలపించారు. 

"జయహో బీసీ... ఇవాళ మీ అందరినీ కలుసుకున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. మీలాగా, మీవంటి కుటుంబాల్లోంచే వచ్చాను. నాకు ప్రతి కన్నీటి చుక్క విలువ తెలుసు. ప్రతి గుండెకోత తెలుసు. ప్రశ్నించే గళాలు ఎప్పుడూ అణచివేతకు గురవుతాయనడానికి నేనొక నిదర్శనం. ఈ మధ్య నన్నెపుడైనా టీవీల్లో చూశారా? ఎవరైనా తప్పు మాట్లాడితే అక్కడే చెడుగుడు ఆడేస్తాను. అన్నీ దులుపుకుని పోయేవాళ్లు ముందుకెళ్లొచ్చు, అణచివేతను ఎదుర్కొనేవాళ్లు వెనుకబడి పోవచ్చు... కానీ వాళ్లెక్కడుంటారో తెలుసా? మీ గుండెల్లో ఉంటారు. టీవీల్లో నేను కనిపించి ఐదు సంవత్సరాలైపోయింది... నన్ను మర్చిపోయారా మీరు?" అంటూ ఉదయభాను జయహో బీసీ కార్యక్రమ ప్రారంభంలో ప్రసంగించారు. 

ఆ తర్వాత, లోకేశ్ ను పలు అంశాలపై ప్రశ్నించిన ఉదయభాను... ఇటీవల బాపట్ల ఘటనలో హత్యకు గురైన బాలుడు అమర్నాథ్ సోదరిని వేదికపైకి పిలిపించి మాట్లాడించారు. ఆమె ఆవేదనను యావత్ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు.
Anchor Udayabhanu
Nara Lokesh
Jayaho BC
Ongole
Yuva Galam Padayatra
TDP

More Telugu News