Traffic Jam: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మున్నేరువాగు .. కీసర టోల్‌గేటు వద్ద 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నిలిచిన ట్రాఫిక్
- మున్నేరుకు 1,92,000 క్యూసెక్కుల వరద
ఏపీ, తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఏకమయ్యాయి. చాలా ప్రాంతాల్లో జాతీయ రహదారులపైకి వరదనీరు చేరడంతో ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నారు. వరద కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మరోమారు ట్రాఫిక్ నిలిచిపోయింది. మున్నేరు వాగు ఇంకా ఉద్ధృతంగానే ప్రవహిస్తుండడంతో కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్ నుంచి విజయవాడ వైపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
వరద ఉద్ధృతి కారణంగా ఐతవరం వద్ద నిన్న సాయంత్రమే ట్రాఫిక్‌ను నిలిపివేశారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఈ ఉదయం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. మున్నేరుకు ప్రస్తుతం 1,92,000 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు జాతీయ రహదారిపై వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. మరోవైపు, నిన్న సాయంత్రం నుంచి వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.