Kargil WAR: కార్గిల్ యుద్ధ సమయంలో అందరూ వెళ్లిపోయినా.. సైనికుల కోసం తన టౌన్ ను వీడని ఒకే ఒక వ్యక్తి!
- కార్గిల్ యుద్ధ సమయంలో నిర్మానుష్యంగా మారిన ద్రాస్ పట్టణం
- సైనికుల కోసం అక్కడే ఉండిపోయిన టీ సెల్లర్ నసీమ్ అహ్మద్
- సైనికులకు టీ ఇస్తూ, ఆహారాన్ని వండుతూ సేవలు
- బాంబులు పడిన ప్రతి సారి వణుకు పుట్టేదన్న నసీమ్
- ప్రతి రోజు 150 నుంచి 200 బాంబులు పడేవని వెల్లడి
1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ కు భారత్ బుద్ధి చెప్పిన సంగతి తెలిసిందే. భారత సైన్యం పరాక్రమం ముందు పాక్ సేనలు తోకముడిచాయి. మరోవైపు యుద్ధ సమయంలో లడఖ్ ప్రాంతంలోని ద్రాస్ పట్ణణం శ్మశానాన్ని తలపించింది. ప్రాణ భయంతో పట్టణంలోని ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. నసీమ్ అహ్మద్ అనే అమ్మే వ్యక్తి మాత్రమే మన సైనికులకు టీ, ఆహారం అందిస్తూ ద్రాస్ లోనే ఉండిపోయాడు.
ఇప్పుడు నసీమ్ వయసు 71 సంవత్సరాలు. ద్రాస్ లోని ఒక పోలీస్ స్టేషన్ వద్ద ఇప్పటికీ టీ అమ్ముతున్నాడు. కార్గిల్ యుద్ధం జరిగి 24 ఏళ్లు గడిచిపోయినా... ఇప్పటికీ మన సైనికులకు నసీమ్ అహ్మద్ మంచి స్నేహితుడిగా మిగిలిపోయాడు. ద్రాస్ లోని ప్రజలంతా పట్టణాన్ని విడిచిపోయినప్పుడు సైనికులకు అక్కడ ఏమీ దొరకని పరిస్థితి ఉంది. అప్పుడు నసీమ్ వారికి అండగా ఉంటూ అన్ని విధాలా సాయపడ్డాడు. అందుకే ఆయన సైన్యం దృష్టిలో ప్రత్యేక వ్యక్తిగా నిలిచిపోయాడు.
మరోవైపు పీటీఐతో నసీమ్ అహ్మద్ మాట్లడుతూ.. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు తాను మాత్రమే ఇక్కడి నుంచి వెళ్లలేదని చెప్పాడు. నియంత్రణ రేఖకు ఇరు వైపులా గ్యాప్ లేకుండా షెల్లింగ్ జరిగేదని తెలిపాడు. దీని వల్ల ఇళ్లు, ఆస్తులు ధ్వంసమయ్యాయని చెప్పాడు. ద్రాస్ నుంచి అందరూ వెళ్లిపోతున్నప్పుడు... తనను వెళ్లొద్దని సైనికులు కోరారని తెలిపాడు.
నువ్వు కూడా వెళ్లిపోతే మాకు ఆహారాన్ని ఎవరు ఇస్తారని వారు అన్నారని... అందుకే సైనికుల కోసం తాను ఇక్కడే ఉండిపోయానని చెప్పాడు. సైన్యం తనకు రేషన్ ఇచ్చేదని... దాంతో తాను ఆహారాన్ని, టీని తయారు చేసి వారికి ఇచ్చేవాడినని తెలిపాడు. సైనికులు కూడా తనకు సాయపడేవారని... వంట పాత్రలను కడిగేవారని చెప్పాడు. అప్పుడప్పుడు తన కుటుంబ సభ్యులు టెలిఫోన్ బూత్ నుంచి తనకు ఫోన్ చేసి, తాను ఎలా ఉన్నానో కనుక్కునేవారని తెలిపాడు.
అది ఒక భయానక అనుభవమని అహ్మద్ చెప్పాడు. షెల్స్ పేలుతున్నప్పుడు వణికిపోయేవాడినని తెలిపాడు. యుద్ధం జరిగిన రెండు నెలలూ... ప్రతి రోజూ దాదాపు 150 నుంచి 200 బాంబులు పేలేవని చెప్పాడు. సాయంత్రం పూట ప్రార్థనల సమయంలోనే కాల్పులు ఆగిపోయేవని తెలిపాడు.
మరోవైపు పాక్ సైనికుల కాల్పులను తట్టుకునేలా నసీమ్ తన టీ స్టాల్ ముందు రాళ్లతో ఒక గోడలా కట్టుకున్నాడు. ఈ గోడ చాటు నుంచి తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా, సైనికులకు రక్షణ ఉండేలా కూడా చేశాడు. పక్కనున్న టైగర్ హిల్స్, టోలోలింగ్ కొండపై నుంచి పాక్ సైనికులు కాల్పులు జరిపేవారు.