YS Vivekananda Reddy: సునీతారెడ్డి న్యాయవాది ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పనివ్వండి.. ఆ తర్వాతే మా నిర్ణయం ఉంటుంది: సుప్రీంకోర్టు
- వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ
- వివేకా కుమార్తె వాదనలపై అభ్యంతరం తెలిపిన శివశంకర్ రెడ్డి న్యాయవాది
- సోమవారం నిర్ణయం తీసుకుంటామని తెలిపిన అత్యున్నత న్యాయస్థానం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకరరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫు లాయర్ వాదనలపై శివశంకరరెడ్డి న్యాయవాది అభ్యంతరం చెప్పారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి... సునీతారెడ్డి తరఫు లాయర్ ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పనివ్వాలని, వాటిని పరిశీలించాకే తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ బెయిల్ పిటిషన్పై సునీతారెడ్డి తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ ఈ కేసుకు సంబంధించి మరో నాలుగు పిటిషన్లు వేరే బెంచ్ ముందు పెండింగ్లో ఉన్నట్లు జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ సంజీవ్ కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు.
సీజేఐ ధర్మాసనం ఆదేశాలు ఉన్నాయని, ఇందుకు అనుగుణంగా మరో ధర్మాసనం పిటిషన్లపై విచారణ జరుపుతోందన్నారు. వేరే బెంచ్ ముందు పెండింగ్ లో ఉన్న పిటిషన్ల వివరాలను, గతంలో సీజేఐ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సునీతారెడ్డి తరఫు న్యాయవాది ద్విసభ్య ధర్మాసనానికి అందించారు.
శివశంకర్ రెడ్డి తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ... గతంలో జారీ చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ ముగియడంతో మరోసారి పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
రిజిస్ట్రీతో సంప్రదించి ఆ పిటిషన్లపై వివరాలు, వాటిలో గతంలో ఇచ్చిన ఆదేశాలు, సీజేఐ ఇచ్చిన ఉత్తర్వులు అన్నింటిని పరిశీలించి సోమవారం నిర్ణయం తీసుకుంటామని ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది.