Nara Lokesh: రాష్ట్రంలో ఇప్పుడు దోపిడీదార్లకు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోంది: లోకేశ్

Lokesh held meeting with Granite Industry owners
  • ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో నేడు లోకేశ్ పాదయాత్ర 
  • త్రోవగుంట వద్ద 2,200 కి.మీ మైలురాయి చేరుకున్న యువగళం
  • ఒంగోలు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు హామీ ఇస్తూ లోకేశ్ శిలాఫలకం
  • గ్రానైట్ పరిశ్రమదారులతో లోకేశ్ సమావేశం
  • సొంత కంపెనీ కోసం జగన్ గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీశాడని విమర్శలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 168వ రోజు ఒంగోలు, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉత్సాహంగా సాగింది. 

పాదయాత్ర ఒంగోలు నియోజకవర్గం త్రోవగుంట వద్ద 2,200 కి.మీ. మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా ఒంగోలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు హామీ ఇస్తూ లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కొద్దిపాటి వర్షానికే తటాకంలా మారుతున్న ఒంగోలు నగరానికి జలదిగ్బంధం నుంచి ఈ డ్రైనేజీ వ్యవస్థ ద్వారా విముక్తి కలుగుతుంది. 

పాదయాత్ర ప్రారంభానికి ముందు ఒంగోలు శివారు రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట క్యాంప్ సైట్ లో గ్రానైట్ పరిశ్రమదారులతో సమావేశమైన యువనేత వారి సాధకబాధలు తెలుసుకున్నారు. 

ఏడుగుండ్లపాడు వద్ద సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించగా, ఇన్చార్జి బి.విజయకుమార్ నేతృత్వంలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

గ్రానైట్ పరిశ్రమదారులతో నారా లోకేశ్ సమావేశం హైలైట్స్...

సొంత కంపెనీ కోసం గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీసిన జగన్!

ఇప్పుడు రాష్ట్రంలో దోపిడీదార్లు, పేదలకి మధ్య యుద్ధం జరుగుతోంది. గత నాలుగేళ్లుగా మైనింగ్ రంగంపై ఆధారపడిన లక్షలాదిమంది కార్మికుల పొట్టగొట్టారు. గ్రానైట్ పరిశ్రమపై రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది ఆధారపడి జీవిస్తుండగా, అలాంటి రంగాన్ని జగన్ దెబ్బకొట్టాడు. జగన్ మైనింగ్ కంపెనీ కోసం రాష్ట్రంలో ఉన్న ఇతర అన్ని మైనింగ్ యజమానులను వేధిస్తున్నారు. 

గ్రానైట్ ని ఇండస్ట్రీగా గుర్తించి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చింది టీడీపీ. మా ప్రభుత్వంలో ఎప్పుడూ గ్రానైట్ పరిశ్రమను వేధించలేదు. రాష్ట్రంలో తమ కంపెనీ తప్ప వేరే కంపెనీ ఉండకూడదన్న విధంగా జగన్ వ్యవహారశైలి ఉంది.

రాయల్టీ వందశాతం పెంచేశాడు!

జీవో నెం.42 తెచ్చి రాయల్టీని వంద శాతం పెంచేశాడు. జీవో నెం.65 తెచ్చి డెడ్ రెంట్ ని 10 రెట్లు పెంచేశాడు. సెక్యూరిటీ డిపాజిట్ 3 రెట్లు పెంచాడు. జీవో నెం.90 తీసుకొచ్చి మైనింగ్ కంపల్సరీ పేరుతో ముందే పన్నులు వసూలు చేస్తున్నాడు. జీవో నెం.13 తెచ్చి ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆపరేషన్స్ ఫీజు భారీగా పెంచేశాడు. జీవో నెం.63 తెచ్చి ప్రైవేట్ వ్యక్తులకు రాయల్టీ వసూలు చేసే హక్కు కల్పిస్తున్నాడు. 

జగన్ చీమకుర్తి వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చాడు. రాయల్టీ, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం అని హామీ ఇచ్చి మాట తప్పాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న మంచి పాలసీలు అధ్యయనం చేసి మెరుగైన పాలసీ అమలు చేస్తాం.

గతంలో ధరకే విద్యుత్ అందజేస్తాం!

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం. గతంలో ఇచ్చిన రేటుకే గ్రానైట్ పరిశ్రమకు విద్యుత్ అందిస్తాం. మైనింగ్ రంగంపై జగన్ పెంచిన పన్నులు అన్ని తగ్గిస్తాం. మైనింగ్ పరిశ్రమను ఆదుకొనే బాధ్యత నేను తీసుకుంటా. మీ నుండి కోరేది ఒక్కటే... ఎక్కువ మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. 

జగన్ మైనింగ్ పరిశ్రమను దెబ్బతీస్తూ తీసుకొచ్చిన అన్ని జీవోలు రద్దు చేస్తాం. మైనింగ్ యజమానులపై పెట్టిన అక్రమ కేసులు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎత్తేస్తాం.

ట్రాన్స్ పోర్టు రంగాన్ని కూడా దెబ్బతీశారు!

ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థని జగన్ కోలుకోలేని దెబ్బ తీశాడు. ఓవర్ లోడ్ పెనాల్టీ, గ్రీన్ ట్యాక్స్, సర్వీస్ ఛార్జీలు విపరీతంగా పెంచేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పెంచిన పన్నులు తగ్గించి ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని కాపాడతాం. 

పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. జగన్ పన్నుల దెబ్బకి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ నెంబర్ వన్ గా ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గించి ధరలు తగ్గిస్తాం. ఎక్స్ పోర్ట్ చెయ్యడానికి గ్రానైట్ పరిశ్రమదారులపై భారం పడకుండా అన్ని కంపెనీల కంటైనర్లు అందుబాటులోకి తీసుకొస్తాం.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2216.1 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 19 కి.మీ.*

*169వరోజు (29-7-2023) యువగళం వివరాలు*

*అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం (ప్రకాశం జిల్లా)*

మధ్యాహ్నం

12.00 - గుండ్లాపల్లి క్యాంప్ సైట్ లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ తో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – గుండ్లాపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

5.00 – పాదయాత్ర అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

5.10 – తిమ్మనపాలెం మాదిగపల్లిలో దళితులతో సమావేశం.

5.25 – తిమ్మనపాలెంలో స్థానికులతో సమావేశం.

6.35 – మేదరమెట్లలో రైతులతో సమావేశం.

6.55 – మేదరమెట్ల బస్ స్టేషన్ వద్ద స్థానికులతో సమావేశం.

7.35 – అద్దంకి అండర్ పాస్ వద్ద హార్టీకల్చర్ రైతులతో సమావేశం.

7.45 – ఆర్.కె.పురంలో స్థానికులతో సమావేశం.

10.15 – అద్దంకి మధురానగర్ విడిది కేంద్రంలో బస.

******

Nara Lokesh
Granite Industry
Ongole
Yuva Galam Padayatra
TDP
Prakasam District

More Telugu News