Water Poisoning: ‘75 హార్డ్ చాలెంజ్’ కోసం రోజుకు 4 లీటర్ల నీళ్లు తాగి ఆసుపత్రి పాలైన టిక్‌టాకర్

Canada Woman hospitalised after drinking 4 litres of water for 12 days

  • అధిక మొత్తంలో తీసుకునే నీరు విషంలా మారే ముప్పు
  • చాలా కేసుల్లో మరణానికి దారితీసే ప్రమాదం
  • సోడియం లోపంతో ఆసుపత్రిలో చేరిన మిచెల్
  • రోజుకు అరలీటరు కంటే తక్కువ నీరు తాగుతానన్న టిక్‌టాకర్

75 రోజులపాటు రోజుకు 4 లీటర్ల నీటిని తాగాలన్న ‘75 హార్డ్’ సోషల్ మీడియా చాలెంజ్‌లో పాల్గొన్న కెనడా మహిళ మిచెల్ ఫెయిర్‌బర్న్ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. 12 రోజులపాటు నీళ్లు తాగి ఆసుపత్రి పాలైంది. ఆ తర్వాత ఈ విషయాన్ని ఆమె టిక్‌టాక్‌లో పంచుకుంది. అధిక మొత్తంలో నీళ్లు తాగడం వల్ల తాను ఎలా అనారోగ్యం పాలైందీ వివరించింది. టొరొంటోలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న ఆమె నీరు ఎలా విషంలా మారిందీ వెల్లడించింది. 

శరీరానికి అవసరమైన మోతాదు కంటే ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల నీళ్లు విషంలా మారిపోతాయి. చాలా కేసుల్లో ఇది మరణానికి దారితీస్తుంది. చాలెంజ్‌లో భాగంగా 12వ రోజున టిక్‌టాక్‌లో వీడియోను షేర్ చేస్తూ.. రాత్రి నిద్రపోవడానికి ముందు తనకు అసౌకర్యంగా అనిపించిందని, రాత్రి చాలాసార్లు టాయిలెట్‌కు వెళ్లేందుకు లేవాల్సి వచ్చిందని పేర్కొంది. ఉదయమంతా టాయిలెట్‌లోనే ఉన్నానని, ఏమీ తినకపోవడంతో వికారంగా, నీరసంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఏం చేయాలో కూడా తనకు అర్థం కావడం లేదని వాపోయింది.

ఆ తర్వాతి రోజు మరో వీడియో పోస్టు చేస్తూ తాను డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుంటే సోడియం తక్కువగా ఉన్నట్టు తేలిందని, ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారని పేర్కొంది. శరీరంలో సోడియం స్థాయులు తగ్గిపోవడం అనేది ప్రాణాంతకం కూడా అవుతుందని వివరించింది. రోజుకు అరలీటరు కంటే తక్కువ నీళ్లు తాగుతూ వర్కవుట్ కొనసాగిస్తానని మిచెల్ పేర్కొంది.

  • Loading...

More Telugu News