ITR: నేటి సాయంత్రంతో ముగియనున్న ఐటీఆర్ ఫైలింగ్ గడువు

What happens when taxpayers miss income tax return filing deadline
  • ఆలస్య రుసుముతో మరో అవకాశం కల్పించనున్న ఆదాయపన్ను శాఖ
  • ఒక్కరోజు ఆలస్యమైనా సరే జరిమానాగా నెల మొత్తానికీ పన్నుపై 1 శాతం వడ్డీ
  • రిటర్న్ ఫైల్ చేయకుంటే భవిష్యత్తులో పన్ను మినహాయింపుల సంగతి మరిచిపోవాల్సిందే
  • గడువు పెంచేది లేదని స్పష్టం చేసిన అధికారులు
ఆదాయపన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి సోమవారం సాయంత్రంతో గడువు ముగియనుంది. గడువు పొడిగించాలంటూ వస్తున్న అభ్యర్థనలను ఆదాయపన్ను శాఖ తోసిపుచ్చింది. గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదివారం సాయంత్రానికి సుమారు 6 కోట్ల మంది ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్ దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, గడువు ముగిసినా ఐటీఆర్ ఫైల్ చేయని వారి పరిస్థితి ఏంటి.. వారు ఎదుర్కునే ఇబ్బందులు ఏంటనే వివరాలు చూద్దాం..

గడువులోగా ట్యాక్స్ ఫైలింగ్ చేయని సందర్భాలలో ట్యాక్స్ పేయర్లకు ఆదాయపన్ను శాఖ మరో అవకాశం కల్పిస్తోంది. రూ.5 వేల ఆలస్య రుసుముతో డిసెంబర్ 31 వరకు దాఖలు చేసుకునే వెసులుబాటు ఉందని చెప్పింది. అయితే, ఆలస్య రుసుముతో పాటు చెల్లించే పన్నుపైనా వడ్డీ కట్టాల్సి వస్తుందని వివరించింది. పన్ను మొత్తంపై నెలకు ఒక్క శాతం వడ్డీ వసూలు చేయనున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఒక్క రోజు ఆలస్యానికీ నెల రోజుల వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న ట్యాక్స్ పేయర్లు రూ.వెయ్యి చెల్లిస్తే సరిపోతుందని, రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ప్రాథమిక మినహాయింపు ఉంటుందని చెప్పారు. 

ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయని వ్యక్తులు, సంస్థలు భవిష్యత్తులో ట్యాక్స్ మినహాయింపు పొందే అవకాశం కోల్పోతారని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. హౌస్ ప్రాపర్టీతో పాటు ఇతర విభాగాల్లో పన్ను ఆదా చేసుకునే వీలుండదని వివరించారు. పన్ను రిటర్న్ దాఖలు చేయడంపై నిర్లక్ష్యానికి జరిమానాతో పాటు జైలుకు వెళ్లే పరిస్థితి కూడా ఎదురవుతుందని హెచ్చరించారు. చెల్లించాల్సిన పన్ను (ఎగవేత) రూ.25 వేలు అంతకంటే ఎక్కువగా ఉంటే.. ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉందని వివరించారు.
ITR
Income Tax
Return filing
taxpayers
ITR deadline

More Telugu News