USA: అమెరికాలో భారత సంతతి వ్యక్తికి అయిదేళ్ల జైలు శిక్ష
- అమెరికాలోకి మనుషుల అక్రమరవాణా కేసులో నిందితుడిగా ఉన్న భారత సంతతి వ్యక్తి
- కెనడా నుంచి అమెరికాకు అక్రమంగా మనుషుల తరలింపుకు 35 వేల డాలర్లు చొప్పున వసూలు
- గతేడాది కెనడాలో నిందితుడి అరెస్ట్, అమెరికాకు తరలింపు
- అమెరికాలో నేరాన్ని అంగీకరించిన నిందితుడు
మనుషుల అక్రమరవాణాకు పాల్పడిన కేసులో కెనడాకు చెందిన భారత సంతతి వ్యక్తి సిమ్రన్ జీత్ షెల్లీకి అయిదేళ్ల జైలు శిక్ష, 250,000 డాలర్ల జరిమానా విధించారు. ఆల్బనీలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. కెనడాకు చెందిన షల్లీ తాను మనుషుల అక్రమరవాణాకు పాల్పడినట్టు అంగీకరించాడు. తొలుత ఆరుగురిని కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా తరలించినట్టు తెలిపాడు. ఆ తరువాత మరికొందరిని ఇదే విధంగా సరిహద్దు దాటించినట్టు అంగీకరించాడు.
అమెరికా అభ్యర్ధన మేరకు కెనడా పోలీసులు గతేడాది జూన్ 28న అతడిని అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించారు. విచారణలో భాగంగా అతడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. మార్చి 2020 నుంచి మార్చి 2021 మధ్య కాలంలో అనేక మంది భారతీయులను కార్న్వాల్ ద్వీపం, ఆక్వేసాన్సే ఇండియన్ రిజర్వ్ మీదుగా అమెరికాలోకి అక్రమంగా తరలించినట్టు వెల్లడించాడు. ఒక్కొక్కరి నుంచి గరిష్ఠంగా 35 వేల డాలర్ల వరకూ తీసుకునేవాడని, అతడి సాయంతో అమెరికాకు వచ్చిన కొందరు చెప్పారు. ఈ క్రమంలో న్యాయమూర్తి నిందితుడికి అయిదేళ్ల జైలు శిక్ష విధించారు. దీన్ని మరో 15 ఏళ్ల వరకూ పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జైలు శిక్ష తోపాటూ నిందితుడికి 250,000 అమెరికా డాలర్ల జరిమానా కూడా విధించారు.