Telangana: ఆశా వర్కర్లకు మంత్రి హరీశ్ రావు తీపి కబురు

Telangana Minister Harish Rao At Neckless Road programe speech
  • ఫోను బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందన్న మంత్రి
  • హైదరాబాద్ లో కొత్తగా చేరిన ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు
  • ఇదే స్ఫూర్తితో ఇకముందు కూడా పనిచేయాలంటూ పిలుపు 
తెలంగాణలో ఆశా వర్కర్లు చాలా కష్టపడుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు. వారి కృషిని, కష్టాన్ని ప్రభుత్వం గుర్తించిందని చెబుతూ.. ఈ నెల నుంచి ఆశా వర్కర్ల ఫోన్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే తెలంగాణలోని ఆశా వర్కర్లకే ఎక్కువ జీతం ఉందని చెప్పారు. దీనికి తోడు ఈ నెల నుంచి వారికి ఫోన్ బిల్లలు భారాన్ని కూడా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈమేరకు మంగళవారం నెక్లెస్ రోడ్ లో జరిగిన వైద్యారోగ్య శాఖ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు చాలా మెరుగు పడిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. గతంలో ప్రసవం కోసం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే వారని, ప్రస్తుతం ఈ పరిస్థితి మారిందని వివరించారు. గతంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో 70 శాతం డెలివరీలు జరిగితే మిగతా 30 శాతం మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేవని చెప్పారు. కానీ, ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది కృషితో నేడు పరిస్థితి రివర్స్ అయిందని మంత్రి వివరించారు.

ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులలో 70 శాతం డెలివరీలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రులు మూతపడే పరిస్థితికి వచ్చాయని తెలిపారు. ఇటీవల తనను కలిసిన ప్రైవేటు డాక్టర్ల బృందం కూడా ఇదే విషయం చెప్పి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు 104 వాహనాలలో గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రులకే తీసుకెళుతున్నారని అన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి తదితర ప్రభుత్వ పథకాలతో ప్రైవేటు ఆసుపత్రులకు డెలివరీ కోసం వచ్చే వారి సంఖ్య తగ్గిందని చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత కష్టపడి పనిచేయాలంటూ ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు మిగతా వైద్య సిబ్బందికి మంత్రి పిలుపునిచ్చారు.


Telangana
Minister Harish Rao
Neckless Road programe
Asha workers
Phone bill
smart phones

More Telugu News