Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకి క్షమాభిక్ష.. జైలు శిక్షను తగ్గించిన మయన్మార్ సైనిక ప్రభుత్వం

Aung San Suu Kyi jail term reduced after some pardons
  • సూకీపై మొత్తం 19 కేసులు పెట్టిన సైనిక ప్రభుత్వం
  • తాజాగా ఐదింట్లో విముక్తి.. తగ్గనున్న ఆరేళ్ల జైలు శిక్ష
  • మాజీ అధ్యక్షుడు విన్ మైంట్ సహా 7 వేల మందికి క్షమాభిక్ష
మయన్మార్ నేత, నోబెల్ బహుమతి విజేత ఆంగ్ సాన్ సూకీకి జైలు శిక్ష నుంచి ఊరట లభించింది. సైనిక ప్రభుత్వం ఆమెకు క్షమాభిక్ష ప్రకటించింది. సూకీపై నమోదైన మొత్తం 19 కేసుల్లో ఐదింట్లో విముక్తి కల్పించింది. మొత్తం 33 ఏళ్ల జైలు శిక్ష పడగా.. అందులో ఆరేళ్ల శిక్ష ఆమెకు తగ్గనుంది. 

మయన్మార్‌‌లో నిర్వహించే బౌద్ధ పండుగ సందర్భంగా సూకీ, దేశ మాజీ అధ్యక్షుడు విన్ మైంట్ సహా మొత్తం ఏడు వేల మంది ఖైదీలకు సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. దీంతో విన్ మైంట్‌కు కూడా నాలుగేళ్ల శిక్ష తగ్గనుంది.  

సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు సూకీని తొలిసారి 1989లో గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ నేపథ్యంలో ఆమెను 1991లో నోబెల్ బహుమతి వరించింది. 2010లో సూకీకి గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించింది.

2015, 2020లో జరిగిన ఎన్నికల్లో వరుసగా సూకీ పార్టీ విజయం సాధించింది. అయితే 2021లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని సైన్యం కూల్చివేసింది. పలు కేసుల్లో సూకీని దోషిగా తేల్చిన కోర్టు జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి జైలులో ఉన్న సూకీని గత వారం గృహ నిర్బంధానికి తరలించారు.
Aung San Suu Kyi
Myanmar
pardon
amnesty
Win Myint
military

More Telugu News