Amit Shah: ఢిల్లీకి సంబంధించి ఏ చట్టాన్నైనా రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది: అమిత్ షా
- ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టిన అమిత్ షా
- బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు
- రాజకీయ దురుద్దేశాలతోనే బిల్లును విపక్షాలు అడ్డుకుంటున్నాయన్న అమిత్ షా
దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పరిపాలన సేవల నియంత్రణ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును కాసేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ... ఢిల్లీకి సంబంధించి ఏ చట్టాన్నైనా తీసుకొచ్చే అధికారాన్ని పార్లమెంటుకు రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. చట్టాన్ని తీసుకొచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని గతంలోనే సుప్రీంకోర్టు తెలిపిందని అన్నారు. కేవలం రాజకీయపరమైన దురుద్దేశాలతోనే బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బిల్లును అనుమతించాలని స్పీకర్ ను కోరారు. విపక్షాల ఆందోళనల మధ్యే బిల్లును స్పీకర్ స్వీకరించారు.