Haryana: హర్యానాలో హింస.. రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో నలుగురి మృతి!

Haryana On Alert After Communal Clashes Leave 4 Dead 30 Injured
  • నుహ్ జిల్లాలో యాత్ర చేపట్టిన విశ్వ హిందూ పరిషత్ 
  • యాత్రను అడ్డుకున్న ఓ వర్గం యువకులు
  • పలు వాహనాలకు నిప్పు
  • రాళ్లు రువ్వుకున్న అల్లరి మూకలు
  • నుహ్ సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ
మణిపూర్‌‌ మంటలు చల్లారాయని అనుకునేలోపే.. హర్యానాలో హింస చెలరేగింది. సోమవారం నుహ్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవల్లో నలుగురు చనిపోగా, 30 మందికి పైగా గాయపడ్డారు. దీంతో నుహ్ జిల్లాలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణల వెనుక కుట్ర కోణం ఉందని అనుమానిస్తున్నామని రాష్ట్ర మంత్రి అనిల్ విజ్ అన్నారు. 

‘బ్రిజ్ మండల్ జలాభిషేక్ యత్ర’ను సోమవారం విశ్వ హిందూ పరిషత్ చేపట్టింది. అయితే గురుగ్రామ్ – అల్వార్ నేషనల్ హైవే వద్దకు యాత్ర చేరుకోగానే ఓ వర్గం యువకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువైపులా ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవల్లో ఇద్దరు హోంగార్డులు చనిపోయారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు అల్లరి మూకలు నిప్పుపెట్టాయి. సాయంత్రానికి పలు ప్రాంతాలకు ఈ హింస వ్యాప్తి చెందింది. 

ఈ ఘటన నేపథ్యంలో నుహ్ లోని నల్హర్ మహదేవ్ మందిర్ లో 2,500 మందికి పైగా చిక్కుకుపోయారు. ఈ గుడిలో ఉన్న వారిని టార్గెట్ చేసుకుని అల్లరి మూకలు రాళ్ల దాడికి దిగాయి. సమీపంలోని కొండపైకి ఎక్కి కాల్పులు జరిపాయి. దీంతో కొన్ని గంటలపాటు లోపల ఉన్న వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. తర్వాత పోలీసులు వారిని కాపాడారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి ఓ వర్గం కట్టడానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. 

ఈ ఘటనలకు సంబంధించి 20 మందికిపైగా పోలీసులు అరెస్టు చేశారు. ఘర్షణల్లో ఇప్పటిదాకా నలుగురు చనిపోగా, 30 మందికి పైగా గాయపడ్డారు. సోహ్నా మనేశ్వర్, పటౌడి ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. ఇద్దరు యువకుల్ని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు మోనూ మనేసరే ఈ ఘర్షణలకు కారణమని ఆరోపణలు వస్తున్నాయి. వీహెచ్‌పీ నిర్వహించిన కార్యక్రమానికి అతడు హాజరవుతున్నాడని తెలియడంతోనే అటువైపు వర్గం వారు అడ్డుకున్నట్లు సమాచారం.
Haryana
Communal Clashes
Nuh Violence
Gurugram

More Telugu News